రాష్ట్రంలో ‘సర్’ గడువును పొడిగించాలి: కేటీఆర్
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:31 AM
రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ షెడ్యూల్‌ను పొడిగించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ షెడ్యూల్‌ను పొడిగించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఎల్‌ఓలు ఇచ్చిన ఎన్యుమరేషన్ పత్రాలను కేవలం 7 శాతం మంది మాత్రమే ఇప్పటివరకు నింపి ఇచ్చారని, ఈ ప్రకారం చివరి తేదిలోపు (జూలై24) మిగిలిన 93 శాతం పూర్తి కావడం కష్టమేనన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా సర్ గడువును పొడిగించాలని కోరారు. సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యులతో ఈ అంశంపై కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్‌ఓలు చాలా చోట్ల సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఓటర్ల డూప్లికేషన్‌పై (రాష్ట్రస్థాయిలో ఒకరికి ఒకటికి మించిన ప్రాంతాల్లో ఓటు) శ్రద్థ పెడుతున్న ఎన్నికల కమిషన్, ఓకే ఓటరు పేరు వివిధ రాష్ర్టాల పరిధిలో ఉంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఒక వ్యక్తికి దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలంటూ.. ఇదే డిమాండ్‌తో త్వరలోనే బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తుందని వెల్లడించారు. బీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేటట్లు కృషి చేయాలని సూచించారు.