కొత్త పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:12 AM
‘తెలంగాణలో ఇప్పటి వరకు చాలా పార్టీలు వచ్చాయి. ఇప్పుడవి ఎక్కడున్నాయి? కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
టీడీపీ తర్వాత నిలబడ్డ పార్టీ బీఆర్‌ఎస్సే.. కవిత పార్టీపై కేటీఆర్ వ్యాఖ్యలు
తమపై విషం చిమ్మడం తప్ప రేవంత్‌కు మరో పని చేతకాదని విమర్శ
లీకులు కాదు.. ధైర్యం ఉంటే బహిరంగంగా మాట్లాడాలని సవాల్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణలో ఇప్పటి వరకు చాలా పార్టీలు వచ్చాయి. ఇప్పుడవి ఎక్కడున్నాయి? కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) పేరిట కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై ఆయన ఈ విధంగా పరోక్షంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ మనమనిషి కాదు.. మరమనిషి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... కేసీఆర్ గురించి చాలా మంది చాలా మాట్లాడుతుంటారని, వాటిని పట్టించుకోమన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ కాలంగా ఉనికిలో ఉన్నవి టీడీపీ.. ఆ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీయేనని చెప్పారు. పార్టీ పునర్ వ్యవస్థీకరణ తదితర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పాకిస్థాన్ ఏర్పాటుతో పోలుస్తూ పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య మాట్లాడిన మాటలను సమావేశం తీవ్రంగా ఖండించిందన్నారు. తమపై విషం చిమ్మడం, వ్యక్తిగత దూషణలు చేయడం తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి మరొక పని చేతకాదని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఎక్స్‌పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నారని, అసలు కాంగ్రెస్ పార్టీ చతికిలపడి ఎన్నేళ్లైందో చెప్పాలని ఎద్దేవా చేశారు. మీడియాతో ‘చిట్‌చాట్’ పేరిట సీఎం టైంపాస్ మాటలు మాట్లాడుతుంటారని, దిగజారుడు మాటలు మానుకుంటే మంచిదన్నారు.లీకులు ఇవ్వడం ఎందుకు.. ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.
రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..!
ప్రజల్లో మార్మోగుతున్న నినాదమిదే: హరీశ్‌రావు
పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, వారి గుండెల్లో మార్మోగుతున్నది.. ‘రేవంత్ పోవాలి... కేసీఆర్ రావాలి’ అనే నినాదమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆగిపోయిన తెలంగాణ ప్రగతిరథం మళ్లీ పరుగులు తీసే రోజు దగ్గరలోనే ఉందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీశ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 4 కోట్ల గొంతుకలను ఏకంచేసి విప్లవశంఖం మోగించిన ధిక్కార వేదిక.. సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారంచేసిన యుద్థగీతిక తమపార్టీ అని అభివర్ణించారు.