Share News

‘సర్‌’తో జాగ్రత్త.. బీజేపీ, కాంగ్రెస్‌ అక్రమాలను నిరోధిద్దాం

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:01 AM

తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పైన దృష్టి సారించాలని.. అధికారంలోని బీజేపీ, కాంగ్రెస్‌లు అక్రమాలకు పాల్పడకుండా నిరోధించాలని పార్టీ...

‘సర్‌’తో జాగ్రత్త.. బీజేపీ, కాంగ్రెస్‌ అక్రమాలను నిరోధిద్దాం

  • పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పైన దృష్టి సారించాలని.. అధికారంలోని బీజేపీ, కాంగ్రెస్‌లు అక్రమాలకు పాల్పడకుండా నిరోధించాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సర్‌ ’ను అడ్డం పెట్టుకొని అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల లక్షలాది ఓట్లను బీజేపీ తొలగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్‌ అడ్డగోలుగా లబ్ధి పొందిందని ఆరోపించారు. రానున్న ఎన్నికలకు అత్యంత కీలకమైన సర్‌ను తెలంగాణలోనూ దుర్వినియోగం చేయకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు తమ ఓట్లను కాపాడుకుంటూ దొంగ ఓట్లు నమోదును నిరోధించాలన్నారు. సర్‌ మార్గదర్శకాల ప్రకారం.. బూత్‌ లెవెల్‌ అధికారులతో సమన్వయానికి పార్టీ తరఫున బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించాలని కేటీఆర్‌ సూచించారు. సర్‌ కార్యక్రమం రానున్న పది రోజుల్లోనే మొదలై, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని. ఓటర్ల జాబితా తయారీ, సవరణ వంటి అంశాలపై ఇప్పటినుంచే కసరత్తు చేయాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 04:01 AM