ఇక్కడ కేసులు.. దావోస్‌లో గ్రీన్ కో సంస్థతో చర్చలా?
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:56 AM
ఫార్ములా ఈ-కార్‌రేస్ కేస్ అంటూ ఓ లొట్టపీసు కేసుపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడేమో ఈ కేసులో దోషులుగా చెబుతున్న గ్రీన్ కో సంస్థతో....
ఇక్కడ కేసులు.. దావో్‌సలో గ్రీన్ కో సంస్థతో చర్చలా?
కేసులు ఎత్తేస్తాం.. బ్యాగులు ఇమ్మని అంటున్నారా? : కేటీఆర్
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-కార్‌రేస్ కేస్ అంటూ ఓ లొట్టపీసు కేసుపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడేమో ఈ కేసులో దోషులుగా చెబుతున్న గ్రీన్ కో సంస్థతో దావో్‌సలో ఆయన భేటీ అయ్యారని.. దీని వెనుక ఉద్దేశం ఏమిటి?అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం.. బ్యాగులు ఇమ్మని వారిని రేవంత్ అడుగుతున్నారా? అని ఎద్దేవా చేశారు. బుధవారం బీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. తాను మొదటి నుంచి చెబుతున్నట్లే రేవంత్ రెడ్డిలో రామ్, రెమో ఉన్నారన్న దానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. మునిసిపల్ ఎన్నికల కోసం తమపార్టీ రంగం సిద్ధం చేసుకుంటోందన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రచారం, నిర్వహణ బాధ్యతలను స్థానిక నాయకులకే అప్పగిస్తున్నామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌గానీ, తానుగానీ.. మునిసిపాలిటీలకు వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం రాదన్నారు. కాగా సింగరేణి టెండర్ల అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరితేనే కేంద్రం పరిశీలిస్తుందని కిషన్‌రెడ్డి చెప్పడం దుర్మార్గమన్నారు. అక్రమ పద్థతిలో తన బావమరిదికి టెండర్లు కట్టబెట్టిన ముఖ్యమంత్రి తానే సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేయాలని ఆశించడం మూర్ఖత్వమన్నారు.