మహిళలకు 57వేల కోట్ల రుణాలిచ్చారా?
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:13 AM
మహిళలకు రూ.57వేల కోట్ల రుణాలు ఇచ్చారా? ఎప్పుడిచ్చారు? ఎక్కడిచ్చారు? ఎవరికిచ్చారు? ఆర్డర్ కాపీ చూపిస్తే... తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్‌ఎ్‌సఎల్పీ ...
ఇచ్చినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా.. రేవంత్ సంతకం చేసిన 6 గ్యారంటీల ఫైలు ఏమైంది?
మహిళలకు రూ.2,500, పింఛన్ రూ.4000 అమలేది?
ఎగ్గొట్టు.. కూలగొట్టు.. చెడగొట్టు.. అన్నట్టుగా పాలన: కేటీఆర్
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మహిళలకు రూ.57వేల కోట్ల రుణాలు ఇచ్చారా? ఎప్పుడిచ్చారు? ఎక్కడిచ్చారు? ఎవరికిచ్చారు? ఆర్డర్ కాపీ చూపిస్తే... తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉప నేత కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ. 2,500, రూ.4వేల పింఛన్, ఆడపిల్లలకు స్కూటీ, కల్యాణలక్ష్మిలో తులం బంగారం వంటి పథకాల అమలేమైందని నిలదీశారు. ఆయా పథకాలకు ఈ బడ్జెట్‌లోనైనా కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. 2023లో ప్రమాణస్వీకారం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సంతకం పెట్టిన ఆరు గ్యారెంటీల ఫైలు ఏమైంది? అని నిలదీశారు. మాయమైన ఈ ఫైలు ఆచూకీ కోసం సిట్ ఏర్పాటు చేయాలని వ్యంగ్యంగా అన్నారు. సీఎం డిక్లరేషన్లకు విలువలేదని, ప్రభుత్వానికి విశ్వసనీయత లేదని... ఇది జీరో వ్యాల్యూ ప్రభుత్వం, జీరో వాల్యూ సీఎం అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో కేటీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు వంటి పదాలు రాకుండా జాగ్రత్త పడ్డారని, 420 హామీల అమలు ప్రస్తావన ఎక్కడా రాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అభయహస్తం కాస్తా భస్మాసుర హస్తంలా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కూలగొట్టు, ఎగ్గొట్టు, చెడగొట్టు... అన్నట్లుగా సాగుతోందన్నారు. పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కగా తీర్చిదిద్దితే... రేవంత్‌రెడ్డి లూటీ చేస్తున్నాడని ఆరోపించారు. మహిళా సాఽధికారతపై మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు.. మిస్ వరల్డ్ పోటీదారులను వేధించి దేశం పరువు తీశారని ఆరోపించారు. అప్పట్లో మహిళా మంత్రి ఇంటికి పోలీసులను ఎందుకు పంపించారో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో పది రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి పేర్కొనగా.. 6.56 లక్షల రేషన్ కార్డులిచ్చినట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారని, మంత్రులకు కూడా అవగాహన లేకపోతే ఎలా? అని నిలదీశారు. ప్రజల ఆస్తులను జీరో చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రమేనని విమర్శించారు. దావోస్, గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రాలు విడుదలచేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరిస్తే... ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని ఏవో ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా పరిశ్రమలను పక్కనపెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులకు, సినీ పరిశ్రమకు భూములిస్తామని ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు తుపాకీ పెట్టి బెదిరిస్తే రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు.