సగం పదవీ కాలం పూర్తయినా హామీల అమలేది?
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:04 AM
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో మీ పదవీ కాలం రెండున్నరేళ్లు దాటినా.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలేది..
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, పిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో మీ పదవీ కాలం రెండున్నరేళ్లు దాటినా.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలేది’ అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై దృష్టి సారించాలని పేర్కొంటూ సీఎంకు ఆయన గురువారం లేఖ రాశారు. ఇప్పటికీ ఎన్నికల హామీల్లో పెండింగ్‌లో ఉన్న 9ు హామీల అమలుకు వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లోనైనా కేటాయింపులు చేయాలన్నారు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ రూ.4,000, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500లను ఇవ్వడానికి అవసరమైన నిధులను 2026-27 సంవత్సర బడ్జెట్‌లో కేటాయించాలని కేటీఆర్ పేర్కొన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అమలుకూ నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి.. 100 రోజుల్లో అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలు సీఎం మరిచిపోయినట్లు నటించినా ప్రజలకు గుర్తు ఉన్నాయన్నారు. మునిసిపల్ ఎన్నికలు ముగియగానే రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఓ సభలో సీఎం వాగ్దానం చేశారని గుర్తు చేసిన కేటీఆర్.. ఎన్నికలు ముగిసి 10 రోజులు కావస్తున్నా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ కాలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో, ఆరు గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకుంటే ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రె్‌సను నిలదీస్తామన్నారు.