90 శాతం గెలవకుంటే.. అదో గెలుపా?
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:18 AM
అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 80-90 శాతం స్థానాలు గెలవకపోతే అది గెలుపు ఎలా అవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
అధికారంలో ఉండి.. ఆ మాత్రం గెలవకపోతే ఎలా?:కేటీఆర్
ప్రధాన ప్రతిపక్షంగా మేం సఫలమయ్యాం
హైదరాబాద్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 80-90 శాతం స్థానాలు గెలవకపోతే అది గెలుపు ఎలా అవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో మునిసిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లు, చైర్ పర్సన్లకు బీఆర్‌ఎస్ పార్టీ 122 స్థానాలు గెలిచిందని గుర్తు చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా సఫలమైందని తెలిపారు. శుక్రవారం మునిసిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇంకా రెండుమూడేళ్లు కొనసాగే అవకాశం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు అధికార పార్టీకే అనుకూలంగా వస్తాయని అన్నారు. అలాంటి స్థానిక ఎన్నికల్లో గెలిచి తమకు తిరుగులేదన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘నిజంగా నీ ప్రభుత్వంపైనీకు అంత నమ్మకం ఉంటే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి.. ఆ 10 చోట్ల మీరు గెలిస్తే నిజంగానే దానిని ఒక ఇండికేటర్‌గా పరిగణిద్దాం’ అని సీఎంకు సవాల్ విసిరారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, కేసీఆర్ లాంటి నేతలే ఎన్నికల్లో ఓడిపోయారని, మునిసిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్ అభ్యర్థులు అధైర్యపడవద్దని సూచించారు. నేనే రాజు, నేనే మంత్రి అని విర్రవీగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లు కూడా ఎందరో వచ్చారు, పోయారని.. ఎవరూ శాశ్వతం కాద ని వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన నేతలెవరైనా గాలికి పోతారని అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం మునిసిపాలిటీలో సీపీఐకి బీఆర్‌ఎస్ మద్దతిస్తుందని ప్రకటించారు.

మునిసిపల్ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీశ్
మునిసిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. డబ్బు రాజకీయాలు, బెదిరింపులు, ప్రభుత్వ యంత్రాంగం అండతో కాంగ్రెస్ సాగించిన అక్రమాలను ఎదిరించి బీఆర్‌ఎస్ శ్రేణులు సత్తా చాటాయని శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశంసించారు. దాదాపు 700లకు పైగా వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం మామూలు విషయం కాదని, రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ఇది నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.