వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:04 AM
రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోంది. పేదలకు ఇళ్లు నిర్మిస్తామని హామీలిస్తూ.. కూల్చివేస్తోంది. హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో..
కూల్చిన చోటే ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు పోరాటం: కేటీఆర్
ఖమ్మం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతితి ప్రతినిధి): ‘‘రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోంది. పేదలకు ఇళ్లు నిర్మిస్తామని హామీలిస్తూ.. కూల్చివేస్తోంది. హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో.. పలు జిల్లాల్లో పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయం. ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది’’ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసాలను అధికారులు తొలగించగా.. ఆ ప్రాంతాన్ని గురువారం కేటీఆర్ సందర్శించారు. ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఖమ్మం అంబేడ్కర్ భవన్ పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా, అనంతరం విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. వెలుగుమట్లలో ఇళ్లను కోల్పోయిన పేదల పక్షాన అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో ప్రస్తావిస్తామని, సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి బీఆర్‌ఎస్ లీగల్ టీం న్యాయం కోసం పోరాడుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోని బాధితులకు వెలుగుమట్లలోనే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ఏతప్పు లేకపోతే ఆర్డీవోను ఆకస్మికంగా ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. బాధితులకు బీఆర్‌ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని,అక్కడే ఇళ్లు నిర్మించాలన్న డిమాండ్‌తో కలిసివచ్చే పార్టీలతో తెలంగాణ ఉద్యమ తరహా పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా, ‘కేటీఆర్‌కు మా బాధలు చెప్పనియ్యరా? బాధితులను కలవకుండా అడ్డుకుంటున్నారు’ అంటూ వెలుగుమట్ల బాధితులు బీఆర్‌ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా క్యాడర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.