Share News

6 గ్యారంటీలకు చట్టబద్ధతను వదలిపెట్టబోం

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:43 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎన్ని ప్రయత్నాలుచేసినా, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అంశాన్ని తాము వదలిపెట్టబోమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు.

6 గ్యారంటీలకు చట్టబద్ధతను వదలిపెట్టబోం

  • టీడీఆర్‌ ఓ పెద్ద కుంభకోణం ..మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎన్ని ప్రయత్నాలుచేసినా, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అంశాన్ని తాము వదలిపెట్టబోమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో.. ఫార్ములా-ఈ రేసు, టీడీఆర్‌ ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన వంటి పలు అంశాలపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో అభూత కల్పనలు సృష్టిస్తోందని విమర్శించారు. ‘‘ఈ ప్రాజెక్టు వల్ల వారం రోజుల్లోనే రాష్ట్రానికి రూ.700కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందని అంతర్జాతీయ సంస్థలే నివేదికలిచ్చాయి. మేము పంపిన రూ.45కోట్లు అక్కడి బ్యాంకులో భద్రంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 700 కోట్ల కుంభకోణం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.’’ అని ఆయన వివరించారు. రాష్ట్రంలో టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌) పేరిట అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. టీడీఆర్‌ ప్రక్రియను సీఎం రేవంత్‌ తన కుటుంబానికి ఓ ‘ఏటీఎం’లా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.

భోజనం.. బొర్రల గురించే మాటలు..కేటీఆర్‌ ఛలోక్తి

అసెంబ్లీ లాంజ్‌లో భోజనాల సమయంలో కేటీఆర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌లు కలిసి భోజనం చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపింది. వీరి ‘లంచ్‌ భేటీ’పై మీడియా ప్రతినిధులు ఆరాతీయగా.. ‘‘భోజనాలు చేసుకుంటూ ఏమి మాట్లాడుకుంటాం..! భోజనాలు, బొర్రల గురించి మాట్లాడుకున్నాం!’’ అంటూ కేటీఆర్‌ తనదైన శైలిలో ఛలోక్తి విసిరారు. 2018 ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకోవడం తప్పని కేటీఆర్‌కు సూచించినట్లు రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.

మంత్రి పదవి ఇస్తే పార్టీకే లాభం: రాజగోపాల్‌రెడ్డి

తాను మంత్రి పదవి కోసం పరితపించట్లేదంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి, ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందన్నారు. సీఎంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

Updated Date - Mar 25 , 2026 | 04:43 AM