బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ‘హిల్ట్’ రద్దు
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:58 AM
బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని 10,000ఎకరాల పారిశ్రామిక భూములను..
5లక్షల కోట్ల ప్రజల సొమ్మును అమ్మేస్తున్న రేవంత్: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని 10,000ఎకరాల పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించడం ద్వారా రూ.5లక్షల కోట్ల ప్రజల సొమ్మును కాజేసేందుకు సీఎం రేవంత్ కుట్ర పన్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ ద్వారా ప్రజల సొమ్మును ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జేబులో వేసుకుంటుందో అందరికీ అర్థమయ్యేలా ప్రజెంటేషన్ల రూపంలో వివరిస్తామన్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క పారిశ్రామిక సంస్థకు లేఖలు రాస్తామని తెలిపారు. ఈ పాలసీ ద్వారా ఎవరైనా భూములను క్రమబద్ధీకరించుకుంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. కాగా, నదీ జలాల విషయంలో నష్టం కలిగిస్తే .. కేంద్రమైనా, రాష్ట్రమైనా తిరుగుబాటు తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ‘‘యాగాలు చేస్తే తప్పు లేదు కానీ... ముఖ్యమంత్రి సైతం తన బాధ్యతలను నిర్వర్తించాలి. కాంగ్రెస్ వాళ్లలాగా క్షుద్ర రాజకీయాలు మాకు తెలియదు. హరీశ్‌రావు గుడికి పోతే తప్పా? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా?’’ అని నిలదీశారు. రాష్ట్రంలో ధరణి పేరు మార్చి.. లెక్క లేనన్ని భూఅక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గజదొంగలా.. పొంగులేటి చిన్న దొంగలా మారారని, మంత్రి వర్గమంతా కలిసి ప్రజల సొమ్మును కాజేస్తున్నారని ఆరోపించారు.