తెలంగాణలో సీఎం అంటే..చీఫ్ మినిస్టర్ కాదు.. కోల్ మాఫియా
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:05 AM
తెలంగాణలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని.. సీఎం అంటే కోల్ మాఫియా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన బీఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని.. సీఎం అంటే కోల్ మాఫియా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణిలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు పుట్టిందని, బీఆర్‌ఎస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఒక్క సమాధానం కూడా రాలేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సింగరేణి అవినీతిపై స్పందించకుండా అప్పుడప్పుడు ఫుట్‌బాల్ ఆడుతున్నారని, విదేశాల్లో తిరుగుతూ పాఠాలు నేర్చుకుంటున్నట్లు ఫొటోలకు ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులోనే ఉండాలని, చదువుకునే వయస్సులో చదువుకోకుండా.. ఇప్పుడు చదుకుంటానంటే ఏమొస్తదని కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం బీర్‌ఎస్ ప్రతినిధులు లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. వివిధ అంశాలపై వివరాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు ఇచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంపై గవర్నర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు పత్రికా సమావేశం పెట్టి, ఆధారాలు బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లో వణుకు మొదలైందని అన్నారు. మీడియా కూడా సహకరించి ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారని ఆయన విమర్శించారు. గవర్నర్‌ను కలిసినవారిలో శాసనమండలిలో బీఆర్‌ఎస్ పక్షనేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి ఉన్నారు.