హామీలు అమలు చేయలేక డ్రామాలు
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:38 AM
అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా హామీలు అమలు చేతగాని సీఎం రేవంత్..
నోటీసులతో దృష్టి మళ్లించే యత్నం
వేధింపులు తప్ప.. ఇందులో ఏముంది
కోల్ స్కాంపై సిట్ వేయండి: కేటీఆర్
పాలన చేతగాక ప్రతీకారం: హరీశ్
సిరిసిల్ల/హైదరాబాద్/మెదక్ మునిసిపాలిటీ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా హామీలు అమలు చేతగాని సీఎం రేవంత్.. రెడ్డి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందులో భాగంగానే మొన్నటి వరకు కాళేశ్వరం కుంభకోణం, గొర్రెల స్కాం, ఫార్ములా రేస్.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. గురువారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణాలను హరీశ్‌రావు బయటపెట్టారని.. అందుకే ఆయనకు సిట్ నోటీసు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందని కిషన్‌రెడ్డి అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢచారి వ్యవస్థ అని..దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే నాయకులకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పని చేసిన శివధర్‌రెడ్డి, మాజీ డీజీపీలు మహేందర్‌రెడ్డి, జితేందర్‌కు తెలుస్తుందని అన్నారు. ఎవరిని పిలవాలో వాళ్లని పిలవాలని.. ఇందులో రాజకీయ నాయకులకు ఏం సంబంధమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లారని, ఆయన వచ్చేదాకా పది రోజులు టైంపాస్ చేయాలి కనుక ఒక రోజు హరీశ్‌రావు, ఇంకో రోజు కేటీఆర్‌ను పిలవండని ఆదేశాలిచ్చారని ఆరోపించారు. రాజకీయ వేధింపులు తప్ప విచారణలో ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్‌ది రాజకీయ కక్షసాధింపు..
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనకు, కేటీఆర్‌కు సిట్ నోటీసులిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.పాలన చేతకాని రేవంత్‌రెడ్డి.. ఆయన్ను నిరంతరం ప్రశ్నించే తమపై ప్రతీకార, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, వరుస కుంభ కోణాలు, బొగ్గు స్కామ్ నుంచి తప్పించుకునేందుకే రేవంత్‌రెడ్డి సిట్ నోటీసుల పేరిట నాటకాలాడుతున్నారని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు విమర్శించారు. సింగరేణిలో బొగ్గు బ్లాక్‌ల కుంభకోణంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా.. కేంద్రంలోని బీజేపీ పట్టించుకోవడం లేదని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నా.. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆధారాల్లేని కేసులకు నోటీసులిచ్చి.. రేవంత్‌రెడ్డి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని శ్రీనివా్‌సగౌడ్ మండిపడ్డారు.