Share News

నా వ్యక్తిత్వ హననానికి కుట్ర

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:18 AM

సంబంధంలేని అంశాల్లోకి తనను లాగుతూ కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నా వ్యక్తిత్వ హననానికి కుట్ర

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): సంబంధంలేని అంశాల్లోకి తనను లాగుతూ కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. డ్రగ్స్‌, హీరోయిన్లతో సంబంధాలు అంటూ తన కుటుంబాన్ని కూడా క్షోభకు గురి చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం సిట్‌ విచారణకు వెళ్లే ముందు, విచారణ తర్వాత ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విచారణకు ముందు కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘డ్రగ్స్‌ కేసు, హీరోయిన్లతో సంబంధాలు అంటూ నన్ను ఇరికించాలని చూశారు. నా కుటుంబాన్ని కూడా మానసిక క్షోభకు గురిచేశారు. కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నన్ను ప్రభుత్వం విచారణకు పిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్‌ ట్యాపింగ్‌ జరగడం లేదా? ట్యాపింగ్‌ జరగడం లేదని డీజీపీ శివధర్‌రెడ్డి, సజ్జనార్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ చెప్పగలరా? బీఆర్‌ఎస్‌ బయపెట్టిన సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామాను సీఎం రేవంత్‌రెడ్డి నడిపిస్తున్నారు. ఆయన బావమరిది కేంద్రంగా రూ.వేల కోట్ల బొగ్గు గనుల కుంభకోణం జరిగినా కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు’ అని కేటీఆర్‌ విమర్శించారు. సిట్‌ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విచారణ పేరుతో వేధించడం తప్ప.. ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు. ‘జరగనిది జరిగినట్లు లీకులిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరితోనో కలిపి నన్ను విచారించినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదు. ఈ విచారణలో తారకరామారావు తప్ప మరే రావు లేరు. ఏవో కొన్ని పేర్లు చెప్పి.. వాళ్లు తెలుసా? వీళ్లు తెలుసా? అని అడిగారు. హీరోయిన్ల ఫోన్లను ట్యాప్‌ చేశామన్నప్రచారం నిజమేనా? మీకు ఏ నటులు ఫిర్యాదు చేశారని సిట్‌ అధికారులను ప్రశ్నించా. ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్‌ కావడం లేదా? అని అడిగితే సిట్‌ అధికారులు నీళ్లు నమిలారు. ఉద్దేశపూర్వక లీకుల్లోని వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా ప్రచారం చేయొద్దు. న్యాయం, ధర్మం అందరికీ ఒకేలా ఉండాలి. సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రులు, సన్నిహితుల దోపిడీపై సిట్‌ వేయాలి’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.


రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన: తలసాని

సీఎం రేవంత్‌ తుగ్లక్‌లా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ విమర్శించారు. సీఎంకు,మంత్రులకు మధ్య సయోధ్య లేదని, మంత్రుల ఫోన్‌లు కూడా ట్యాప్‌ చేస్తున్నట్లు చెబుతున్నారని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టుల్లో అవినీతికి సంబంధించిన ఆధారాలను బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు బయట పెట్టగానే, ఆయనకు సిట్‌ నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. ఫోన్‌ట్యాపింగ్‌ చట్ట విరుద్ధమేమీ కాదని ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ అన్నారు. దేశభద్రత, ప్రజారక్షణ, తీవ్రవాదుల దాడులను నిరోధించేందుకు ట్యాపింగ్‌ చేయొచ్చని చట్టమే చెబుతోందని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును విచారించే నైతిక అర్హత హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు లేదని అన్నారు. ట్యాపింగ్‌ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. రేవంత్‌కు పాలన చేతకాక ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీమంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ మండిపడ్డారు. కాగా, విచారణ సందర్భంగా ట్యాపింగ్‌ కేసుతో సంబంధం లేని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారని సిట్‌ అధికారులపై కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jan 24 , 2026 | 05:18 AM