Share News

సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి: కేటీఆర్‌

ABN , Publish Date - May 18 , 2026 | 03:26 AM

తప్పు చేసిన తన కొడుకును కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తొమ్మిది రోజులు దాచిపెట్టారు. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాదు..

సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/వనస్థలిపురం, మే 17 (ఆంధ్రజ్యోతి): ‘‘తప్పు చేసిన తన కొడుకును కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తొమ్మిది రోజులు దాచిపెట్టారు. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాదు.. దేశానికీ అవమానకరం. పోక్సో కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలంటే సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి. ‘బేటీ బచావో.. బేటీ పడావో..’ నినాదాలకే పరిమితమైతే.. బాలికలకు న్యాయం జరగదన్న విషయం ప్రధాని మోదీ గుర్తుంచుకోవాలి. వెంటనే సంజయ్‌ విషయంలో నిర్ణయం తీసుకోవాలి’’ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ(ఎ్‌సఐఆర్‌) నేపథ్యంలో ‘నా బూత్‌ - నా భవిష్యత్తు’ పేరిట ఎల్‌బీనగర్‌లోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ బూత్‌ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోనే మొదటిసారి ఓ కేంద్రమంత్రి కొడుకుపై లుకౌట్‌ నోటిసులు జారీ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఆయన కొడుకు వల్ల ఓ బాలికకు అన్యాయం జరిగిందని, పైగా ఆమె తల్లిదండ్రులను కేంద్ర మంత్రి పిలిపించి బెదిరించారని ఆరోపించారు. ఇంత తీవ్రమైన కేసును సీఎం రేవంత్‌రెడ్డి నీరుగార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. హనీ ట్రాప్‌ అని.. మీడియాను మనీ ట్రాప్‌లో పడేసి.. రేవంత్‌, సంజయ్‌ వార్తలు రాయకుండా కుట్ర చేశారని ఆరోపించారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరగకపోతే.. రేపు అఘాయిత్యం జరిగినా ఏ అమ్మాయి కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసే ధైర్యం చేయదన్నారు. కేంద్ర మంత్రి భయపెట్టినా.. బాలికకు తల్లి అండగా ఉందని, అదరకుండా, బెదరకుండా న్యాయం కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. ఆ తల్లిదండ్రుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ పార్టీ, మహిళా నాయకత్వం అండగా ఉందన్నారు.

Updated Date - May 18 , 2026 | 03:26 AM