కుమ్మెర బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలి
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:50 AM
కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
ఇంటి నిర్మాణానికి రూ.10లక్షల ఆర్థికసాయం ప్రకటన
తక్షణ సాయం కింద 1లక్ష అందజేత
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బాధితులకు కేటీఆర్ పరామర్శ
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తరుఫున రూ.10 లక్షల వ్యయంతో ఇంటిని నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చిన ఆయన, తక్షణ సహాయం కింద రూ.1లక్ష అందజేశారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కుమ్మెర జాతర బాధిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. దాడిలో రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఏఐ యుగంలో ఇంకా కుల రాజకీయాలు కొనసాగడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం, కనీసం పరామర్శకు కూడా రాకపోవడం అత్యంత దారుణమన్నారు. కుల దురహంకార దాడులు ఎక్కడ జరిగినా ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. బహుజన ఉద్యమ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ, పసికూనను కాళ్లతో తన్నడం అంటే మానవత్వాన్ని, రాజ్యాంగాన్ని ఖననం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్య పోకడలను అడ్డుకునేందుకు కవులు, రచయితలు తమ కలాలను ఆయుధాలుగా మలచాలని పిలుపునిచ్చారు. మరోవైపు, కుమ్మెర ఘటనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని బృందం డీజీపీ శివధర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే రాష్ట్రంలో 142 పరువు హత్యలు జరిగాయని, వీటన్నింటిపైనా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.