Share News

మాది ఉద్యమకారుల జాతి.. మీది ద్రోహుల జాతి

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:28 AM

‘ఈ మధ్య ఓ సన్నాసి కేసీఆర్‌ ఏ జాతి.. ఏ జాతికి పిత అని ప్రశ్నిస్తున్నారు. ఆ సన్నాసికి ఒకటే చెబుతున్నా వాళ్లలా ఢిల్లీకి సలాం కొట్టే జాతి కాదు మాది.

మాది ఉద్యమకారుల జాతి.. మీది ద్రోహుల జాతి

  • ఇది ‘కేసీఆర్‌ ఏ జాతికి పిత’ అని అడుగుతున్న సన్నాసికి చెబుతున్నా: కేటీఆర్‌

  • కేసీఆర్‌ అధికారం చేపట్టే రోజు తొందర్లోనే ఉంది: హరీశ్‌

హైదరాబాద్‌, పిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘ఈ మధ్య ఓ సన్నాసి కేసీఆర్‌ ఏ జాతి.. ఏ జాతికి పిత అని ప్రశ్నిస్తున్నారు. ఆ సన్నాసికి ఒకటే చెబుతున్నా వాళ్లలా ఢిల్లీకి సలాం కొట్టే జాతి కాదు మాది. తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడే జాతి మాది’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ 72వ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో 72 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నవి రెండే జాతులేనని, అందులో ఒకటి ఉద్యమకారులది.. మరొకరిది ద్రోహుల జాతి అని పేర్కొన్నారు. ‘కిరాయి వాళ్ల పంచన చేరి కిరాయి బతుకు బతికే వాళ్లం కాదు.. సోయి ఉన్న, సొంత శక్తి ఉన్న జాతి మాద’ంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. అధిష్ఠానం ఆడిస్తే ఆడడం, ఢిల్లీలో కీ ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి తమది కాదని, తెగువ, పౌరుషం ఉన్న భూమిపుత్రుల జాతి అని అన్నారు. తాను జాతిపితనని కేసీఆర్‌ ఎన్నడూ చెప్పుకోలేదని, తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చినందుకు ప్రజలే ఆయన్ను అలా పిలుచుకుంటున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోదని, ఓటమి తాత్కాలికమని, కేసీఆర్‌ ఆధ్వర్యంలో అధికారం చేపట్టే రోజు తొందరలోనే ఉందన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 06:29 AM