హైడ్రాలు, బుల్డోజర్లు పేదోళ్ల ఇళ్లపైకేనా?
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:02 AM
హైడ్రాలు, బుల్డోజర్లు పేదోళ్ల ఇళ్లపైకే వస్తాయా..? పెద్దొళ్ల ఇళ్లపైకి వెళ్లవా..?’ అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
చెరువుల్లో ఇళ్లు, ఫాంహౌస్‌లున్న పెద్దొళ్ల ఇంటికి వెళ్లవా?: కేటీఆర్
అండగా ఉంటామని రాజేంద్రనగర్ హనుమాన్‌నగర్ వాసులకు భరోసా..
రాజేంద్రనగర్/శంషాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ‘హైడ్రాలు, బుల్డోజర్లు పేదోళ్ల ఇళ్లపైకే వస్తాయా..? పెద్దొళ్ల ఇళ్లపైకి వెళ్లవా..?’ అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఉంది పేదోళ్లకు కొత్త ఇళ్లు కట్టించి ఇవ్వడానికి గానీ, కూల్చడానికి కాదన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ హనుమాన్‌నగర్‌లో ఆయన పర్యటించారు. ఇక్కడి 350కి పైగా ఇళ్ల నివాసితులను ఖాళీ చేయించేందుకు సర్కారు సమాయత్తమవుతున్న నేపథ్యంలో వారితో సమావేశమై మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎప్పుడూ పేదల పక్షమేనంటూ భరోసా కల్పించారు. ‘హైడ్రాలు, బుల్డోజర్లు దుర్గంచెరువు తలాబ్‌లో ఇల్లు కట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి అన్న ఇంటికి వెళ్లవా.. రేవంత్ తన గ్రామంలో కట్టుకున్న రెడ్డి కుంట ఇంటికి వెళ్లవా..? అంతెందుకు హిమాయత్‌సాగర్ జలాశయంలో ఫాంహౌస్‌లు, ఇండ్లు కట్టుకున్న మంత్రులు వివేక్, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఇళ్లపైకి వెళ్లవా..?’ అని ప్రశ్నించారు. ‘హనుమాన్‌నగర్‌వాసులు ఐక్యంగా ఉండి ఒక్క ఏడాది తమ ఇళ్లను కాపాడుకోవాలి. మీ వెంట కార్తీక్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మేమంతా ఉంటాం.. సంవత్సరం తర్వాత 2028 చివరిలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి. అప్పుడు సీఎంగా మీరు కోరుకుంటున్న కేసీఆర్ వస్తారు. మీ అందరికీ ఇళ్ల పట్టాలిస్తాం’ అని హామీనిచ్చారు. ముఖ్యమంత్రి పదవిని గుంపు మేస్త్రీ పదవితో పోల్చుకున్న రేవంత్‌కు.. గుంపు మేస్త్రీ ఇళ్లను కడతాడు కానీ కూల్చడన్న సంగతి తెలియదా అని ఎద్దేవా చేశారు. ‘వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తానన్నాడు.. కోడళ్లకు మహాలక్ష్మి కింద రూ.2,500, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా లక్షా నూట పదహార్లు కాక తులం బంగారం, ఇటు విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తానన్నాడు.. గద్దెనెక్కి రెండున్నరేళ్లు దాటుతున్నా అవన్నీ ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలి’ అని రేవంత్‌ను డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం శంషాబాద్‌లో 180 ఎకరాల సీలింగ్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసింది. శంషాబాద్ ఎమ్మార్వో కార్యాలయంపై ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న భూములను సీఎం రేవంత్ తన అనుయాయులకు అప్పజెపుతున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు. శంషాబాద్ జోన్ కేంద్రంలోని జేడీ కన్వెన్షన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశం, ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయిలో కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండి ఓటర్ జాబితాలో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని సూచించారు.