KTR Criticizes State Governance: రెండేళ్లుగా రాష్ట్రం తిరోగమనం
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:29 AM
రెండేళ్లుగా రాష్ట్రం తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని.. క్యాలెండర్లు మారాయేతప్ప కాంగ్రె్‌సపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ దుష్టపాలనపై నిత్య పోరాటం
పార్టీ పటిష్ఠత కోసం సంస్థాగత నిర్మాణం
2028లో కేసీఆర్‌ను సీఎంగా చూడటమే లక్ష్యం: కేటీఆర్
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా రాష్ట్రం తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని.. క్యాలెండర్లు మారాయేతప్ప కాంగ్రె్‌సపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ దుష్టపాలనకు వ్యతిరేకంగా నిత్య పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ, కేక్ కట్ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కొత్త సంవత్సరంలో ఒకవైపు ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు పార్టీ పటిష్ఠత కోసం సంస్థాగత నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఒక్కటై బీఆర్‌ఎ్‌సపై దాడిచేస్తున్నాయన్నారు. కానీ ప్రజల ఆశీర్వాదం, దేవుడి దయ ఉన్నంతకాలం బీఆర్‌ఎ్‌సను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. 2028లో తిరిగి కేసీఆర్‌ను సీఎం చేసే ధ్యేయంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అసెంబ్లీలో ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలి..
పాలమూరు ప్రాజెక్టు, కృష్ణాజలాలపై ప్రభుత్వం శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ తరఫున కూడా ప్రజెంటేషన్‌కు అవకాశం కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2016 మార్చి 31న కేసీఆర్ శాసనసభలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమంటూ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రజెంటేషన్ ఇస్తుందని నిలదీశారు. ‘‘సాగునీటి అంశాలపై ఏమాత్రం అవగాహన లేని సీఎం రేవంత్‌రెడ్డి.. శాసనసభలో ఏ ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారు? చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా? మేడిగడ్డను ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చారో వివరిస్తారా? వట్టెం పంపుహౌ్‌సను ఎలా ముంచారో చూపిస్తారా? కృష్ణానదిలో తెలంగాణకు ఉన్న హక్కులను కృష్ణాబోర్డుకు ఎలా ధారాదత్తం చేశారో చెబుతారా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.