ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సంక్షోభమే: కేటీఆర్
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:36 AM
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఇంటింటా సంక్షోభాన్ని మిగిల్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
హనుమకొండ టౌన్/దామెర, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఇంటింటా సంక్షోభాన్ని మిగిల్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా నిలిచారని ఎద్దేవా చేశారు. సోమవారం హనుమకొండలోని మడికొండ, దామెర మండల కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలు, సోషల్‌మీడియా శిక్షణ తరగతులకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు 73 సార్లు ఢిల్లీకి పోయినా.. రాష్ట్రానికి 70 పైసలు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. తెలంగాణ సంపదను ఢిల్లీలోని తమ హైకమాండ్‌కు కప్పం కడుతున్నారని ఆరోపించారు ‘రాష్ట్రంలో రైతుబంధు బంద్ అయింది కానీ,రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తోంది’ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడతూ ఇబ్బందులకు గురిచేస్తున్న.. రేవంత్‌రెడ్డి ముఠా సభ్యులను, కాంగ్రెస్ నాయకులను, వారికి సహకరిస్తున్న అధికారులను వదిలిపెట్టేదే లేదని, తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని కేటీఆర్ హెచ్చరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వరంగల్‌కు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను తీసుకొచ్చిన ఘనత బీఆర్‌ఎ్‌సదేనని గుర్తు చేశారు.