Share News

KTR Criticizes: ముగ్గురు మంత్రులు.. మోసగాళ్లు

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:55 AM

420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రెండేళ్లుగా పీకిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు.

KTR Criticizes: ముగ్గురు మంత్రులు.. మోసగాళ్లు

  • 30ు కమీషన్లు దండుకుంటున్నారు: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఖమ్మం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రెండేళ్లుగా పీకిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. హామీలు నెరవేర్చకపోవడంపై ప్రశ్నిస్తే లాగుల్లో తొండలు వదులుతా, గుడ్లు పీకుతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా.. అంటూ బూతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను ఉద్దేశించి చండాలపు మాటలు మాట్లాడుతుంటే కొడుకుగా తనకు రక్తం ఉడుకుతోందని తెలిపారు. స్వరాష్ట్ర కలను నెరవేర్చిన కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు గెలిపించింది పనికిమాలిన మాటలు మాట్లాడడానికి కాదని, పని చేయాలని హితవు పలికారు. రేవంత్‌రెడ్డిలాగా తాను దిగజారి మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్‌లను కేటీఆర్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మోసగాళ్లని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి 30శాతం పర్సంటేజీలు తీసుకుంటున్నారని, మంత్రి తుమ్మల కూడా అదే దారిలో ఉన్నారని విమర్శించారు. ముగ్గురు మోసగాళ్లకు అసలైన అలీబాబా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో సీతారామ ప్రాజెక్టుకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టి, 90శాతం పనులు చేస్తే.. దాన్నీ పూర్తి చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. నదీజలాల విషయంలో సీఎంకు అవగాహన లేదని, దేవాదుల ఎక్కడుంది? బాక్రానంగల్‌ ఎక్కడుంది? అనేది కూడా తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా కృష్ణా, గోదావరి జలాలు దోపిడీకి గురవుతున్న నేపథ్యంలోనే కేసీఆర్‌ మళ్లీ ఉద్యమానికి సిద్ధమయ్యారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని, కాంగ్రెస్‌ పాలనలో రూ.9.50లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారని నిలదీశారు. మంత్రి పొంగులేటి.. బాంబులేటిగా మారారని, రెండు దీపావళి పండుగలు దాటిపోయినా ఏ బాంబూ పేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈడీ కేసులు మూసివేస్తే.. బీజేపీలో చేరుతానంటూ తిరుగుతున్నాడని, అదానీ, అంబానీ కాళ్లు పట్టుకుని బతిమిలాడుతున్నారని విమర్శించారు. ఖమ్మంలో మరో మంత్రి బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఎంత మందిని కాంగ్రె్‌సలో చేర్చుకున్నా ఫర్వాలేదని, తమ వద్ద చాకుల్లాంటి పిల్లలున్నారని.. కొత్త వారిని నాయకులుగా తయారు చేస్తామన్నారు.

కేటీఆర్‌ ర్యాలీలో వైసీపీ జెండాలు

కూసుమంచి: కేటీఆర్‌ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నాయకన్‌గూడెం నుంచి ఖమ్మం వరకు జరిగిన బైక్‌ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ జెండాలతోపాటు జగన్‌ ఫొటోలతో కూడిన వైసీపీ జెండాలను ప్రదర్శించడం, జై కేటీఆర్‌, జై జగన్‌, జై కేసీఆర్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - Jan 08 , 2026 | 03:55 AM