కాంగ్రెస్ నేతలకో న్యాయం.. మాకో న్యాయమా?
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:40 AM
ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ఉద్దేశంతోనే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
బాల్క సుమన్‌పై అక్రమ కేసులు సిగ్గు చేటు: కేటీఆర్
సైదాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ఉద్దేశంతోనే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో మల్కాజిగిరి ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రగతిభవన్‌ను బాంబులతో పేల్చినా తప్పులేదని మాట్లాడారని, పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని కేంద్రమంతి బండి సంజయ్, హరీశ్‌రావుపై పెట్రోల్ పోసి అంటిస్తానని కాంగ్రెస్ నేత మైనంపల్లి, స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీని తగలపెడతానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించడం.. శిక్షార్హం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం, మా పార్టీ నాయకులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న బాల్క సుమన్‌ను గురువారం కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్‌రెడ్డిలు పరామర్శించారు. అనంతరం జైలు బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బాల్క సుమన్‌ను ఎన్ని రోజులు జైల్లో పెట్టుకుంటారో పెట్టుకోండని.. సింగరేణిలో బొగ్గు దోపిడీని వదిలిపెట్టబోమని చెప్పారు.