వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే టీ
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:12 AM
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఆత్మపరిశీలన చేసుకున్నాం
లోపాలు సరిచేసుకుంటాం
మాకు బీజేపీతోనే పోటీ
కాంగ్రెస్‌ది మూడోస్థానమే
మీడియాతో చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని చెప్పారు. శుక్రవారం నందినగర్‌లోని నివాసంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఒంటరి పోరాటం తమకు కలిసి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో తమకు బీజేపీతోనే పోటీ ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని చెప్పారు. గత ఎన్నికల్లో తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని ఆత్మ పరిశీలన చేసుకున్నామని.. లోపాలను సరిచేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జారుడు బల్లపై ఉందని, అది ఇంకా కిందికి దిగజారిపోవడం తప్ప పైకి రాదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ12 ఏళ్ల పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. హైడ్రా ఒక బ్లాక్ మెయిల్ సంస్థగా మారిందని ఆరోపించారు. డబ్బు వసూళ్లు తప్ప అది ఇంకేమీ చేయడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్‌శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని, ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుట్రలే కారణమని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కంపు అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి డబ్బులిచ్చి సీఎం సీటు కొనుక్కున్నారని, ఇప్పటికీ ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుందని ఆరోపించారు. రేవంత్ రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. సీఎం రూ.200 కోట్లతో రాజసౌధాలు కట్టుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణి అంశంలో కాంగ్రెస్ అనేక కుంభకోణాలకు పాల్పడుతోందని, వాటిని స్వయంగా సీఎం బావమరిది నడిపిస్తున్నాడని విమర్శించారు.