కాంగ్రెస్‌కు డెత్ డిక్లరేషన్ రాయాలి..!
ABN , Publish Date - Jul 19 , 2026 | 05:52 AM
యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.
చావు దెబ్బ కొడితేనే వారికి సోయి వస్తుంది
70వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చెయ్ రేవంత్
నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటా
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సులో మాజీ మంత్రి కేటీఆర్
చాదర్‌ఘాట్/వనస్థలిపురం/ఎల్‌బీనగర్, హైదరాబాద్ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. చావు దెబ్బ కొడితేనే కాంగ్రెస్ నేతలకు సోయి వస్తుందన్నారు. నోటిఫికేషన్లతో సహా 70వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్ నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అవసరమైతే రాహుల్‌గాంధీకి జై కొడతానన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో జిత్తులమారి ముసలి నక్క కాంగ్రెస్ రాష్ట్ర యువజనాన్ని తెలివిగా చిత్తు చేసిందని కేటీఆర్ చెప్పారు.
రాహుల్, ప్రియాంకలకు గుణపాఠం తప్పదు
రాహుల్, ప్రియాంక తెలంగాణ యువతకు చేసిన మోసాన్ని గుర్తుంచుకొని గుణపాఠం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్‌గాంధీకి తెలంగాణలో నిరుద్యోగుల వీపులపై లాఠీల మోతలు, అక్రమ కేసులతో అణిచివేస్తుంటే కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి యేడాది ఇస్తామన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయని, జాబ్ కాలెండర్, నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులు కొలువుల నోటిఫికేషన్లు ప్రకటించాలని రోడ్డెక్కుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం లూటిఫికేషన్‌లో మునిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు కానీ రేవంత్ బినామీల బీరువాలు నిండుతున్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్ జేబులు నింపే పనిలో బిజీగా ఉన్న రేవంత్ జాబులు ఎక్కడి నుంచి ఇస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ తాను నమ్ముకున్న హిట్లర్ కంటే దారుణమైన క్లైమాక్స్ చూడబోతున్నారని, ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక ముందు ఒక లెక్క అని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలను బీజేపీ తన్నుకుపోతుందని, ఇదేనా ఆ పార్టీ జాతీయవాదం అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం ఒక్క రోజు కూడా ప్రయత్నం చేయని రేవంత్, బండి సంజయ్ నిరుద్యోగులపై ఇష్టానికి మాట్లాడడం సబబు కాదన్నారు. కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా తాము నేపాల్ తరహలో విధ్వంసానికి పిలుపునివ్వడం లేదని, ప్రజాస్వామికంగానే ప్రభుత్వ మోసాలు ఎండగడతామని కేటీఆర్ చెప్పారు. 2028లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం యువత ఆకాంక్షలకు న్యాయం చేసే బాధ్యత తనదేనన్నారు. కేటీఆర్ ప్రసంగించడానికి వస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ శ్రేణులు సీఎం..సీఎం అంటూ నినదించారు.