మాది వికాసం.. కాంగ్రెస్‌ది విధ్వంసం
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:31 AM
విధ్వంసం.. అరాచకం లేకుండా మూసీని అభివృద్ధి చేయవచ్చని, కాంగ్రెస్‌కు చేతగాకపోతే తామే చేసి చూపిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
పేదల ఇళ్లు కూలగొడితే బుల్డోజర్లకు అడ్డుపడతాం: కేటీఆర్
హైదరాబాద్ సిటీ, మార్చి5 (ఆంధ్రజ్యోతి): విధ్వంసం.. అరాచకం లేకుండా మూసీని అభివృద్ధి చేయవచ్చని, కాంగ్రెస్‌కు చేతగాకపోతే తామే చేసి చూపిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ మోడల్‌లో వికాసం ఉంటే కాంగ్రెస్ విధానాల్లో విధ్వంసం ఉందన్నారు. మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్ల వ్యయం చూపుతున్నారని, కేవలం రూ.16వేల కోట్లతో పనులు పూర్తి చేయవచ్చన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత తమకు అప్పగిస్తే తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తామన్నారు. మూసీ పేరుతో ఆయన చేస్తున్న లూటీని అడ్డుకుంటామన్నారు. గురువారం మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్‌ఎస్ సీనియర్ నేతలతో కలిసి పర్యటించిన కేటీఆర్ తొలుత నాగోల్‌లోని ఎస్టీపీని సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట హైదరాబాద్‌లో సృష్టిస్తున్న విధ్వంసాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామన్నారు. రేవంత్‌రెడ్డి చేస్తున్నది మూసీ బ్యూటిఫికేషన్ కాదని లూటిఫికేషన్ అని ఎద్దేవా చేశారు. కేవలం రూ.16వేల కోట్లతో మొత్తం మురుగుశుద్ధి చేయడంతో పాటు కొండపోచమ్మ నుంచి మంచి నీళ్లను మూసీలోకి తేవడం, రెండు వైపులా స్కైవేల నిర్మాణం వంటి అన్ని కార్యక్రమాలతో డీపీఆర్ ప్రభుత్వానికి అందుబాటులో ఉంద న్నారు. అయినా అవినీతి సంపాదన కోసం రేవంత్ రెడ్డి ఈ మూసీ ప్రాజెక్టును ఎత్తుకున్నారని విమర్శించారు. స్వయంగా రేవంత్‌రెడ్డి కొస్గిలోని తన ఇంటిని రెడ్డికుంటలో నిర్మించారని, ఆయన తమ్ముడు తిరుపతిరెడ్డి దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌లో ఇంటిని నిర్మిస్తే.. అక్కడికి బుల్డోజర్లు ఎందుకు రావన్నారు. హిమాయత్‌సాగర్ మధ్యలో మంత్రులు పొంగులేటి, వివేక్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, కేవీపీలు నిర్మించిన ఇళ్లను కూలగొట్టే దమ్ము హైడ్రాకు ఉందా అని నిలదీశారు.