దమ్ముంటే.. 20లక్షల ఇళ్లు ఇచ్చాకే ఓట్లడగండి
ABN , Publish Date - May 29 , 2026 | 03:58 AM
గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దమ్ముంటే.. ఆ మాట నిలబెట్టుకున్నాకే ఓట్లు అడగాలి.....
మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దమ్ముంటే.. ఆ మాట నిలబెట్టుకున్నాకే ఓట్లు అడగాలి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. గత రెండున్నరేళ్లలో కట్టిన ఇళ్లెన్ని..? పడగొట్టిన ఇళ్లు ఎన్ననే దానిపై శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఉందా? అని గురువారం ఆయన ఓ ప్రకటనలో ప్రశ్నించారు. పొంగులేటి మాదిరి కోహినూరు హోటల్లో కాళ్లు పట్టుకొని, ఢిల్లీకి లొంగిపోయి కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం తమకు తెలియదని, దీపావళికి బాంబులు పేలుస్తామని తుస్సుమనిపించిన ‘తుపేల్ మినిస్టర్’, ‘మిస్టర్ బాంబులేటి’ అంటూ ఎద్దేవా చేశారు. అడ్డదారుల్లో కొడుకు కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు తమకు తెలియవని పేర్కొన్నారు.