కేసీఆర్‌కూ నోటీసులిస్తారట..?
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:19 AM
డెయిలీ సీరియల్‌లా రెండేళ్లుగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంతా డొల్ల అని.. అది పనికిరాని కేసు అని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు..
అన్నీ లీకులే.. ట్యాపింగ్ కేసు డొల్ల
రేవంత్ బావమరిది దోపిడీని..వెల్లడించినందుకే హరీశ్‌పై కక్ష: కేటీఆర్
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): డెయిలీ సీరియల్‌లా రెండేళ్లుగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంతా డొల్ల అని.. అది పనికిరాని కేసు అని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విచారణ చేయడానికి ఏమీ లేని కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కూ నోటీసులిస్తామన్న లీకులతో ప్రచారాలు చేయడం హాస్యాస్పదమన్నారు. లీకులు ఇవ్వడం, మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు ప్రచారాలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం బావమరిది సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని బయటపెడితే.. కక్షగట్టి హరీశ్‌రావుకు సిట్ నోటీసులిచ్చారని పేర్కొన్నారు. గతంలోనే సుప్రీం కోర్టు కొట్టివేసిన అంశాన్ని మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మళ్లీ తెరపైకి తేవడం సిగ్గుచేటన్నారు. సింగరేణిలో అక్రమాలు జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని, ఇందులో బీజేపీ నేతలకూ వాటాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, అధికారులు ఆచితూచి పనిచేయాలని హెచ్చరించారు. రెండేళ్ల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, అక్రమంగా వ్యవహరిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్నారు. గత పదేళ్లలో తామెప్పుడూ పోలీసు వ్యవస్థను ఇలా వాడుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు.