Share News

మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:13 AM

అవినీతి అక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిది దండుపాళ్యం బ్యాచ్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి

  • సర్కారు స్పందించకుంటే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: కేటీఆర్‌

  • గన్‌పార్క్‌ వద్ద ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌/ గన్‌పార్క్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): అవినీతి అక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిది దండుపాళ్యం బ్యాచ్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో లెవనెత్తుతామని, ప్రభుత్వం స్పందించక పోతే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అసిఫాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన పలువురు కార్యకర్తలు ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎ్‌సలో చేరారు. మరోవైపు మంత్రి పొంగులేటి బంధువు అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి కంపెనీ నిబంధనల ఉల్లంఘన, అవినీతి, అక్రమ మైనింగ్‌పై బీఆర్‌ఎ్‌సఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆధారాలతో బయట పెట్టడంతో సర్కారు కలవర పడిందన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ మంత్రి పొంగులేటి దూరపు బంధువులది అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఓబులాపురం మైనింగ్‌ కేసులో మాదిరిగా సభా సంఘం వేసి పారదర్శక విచారణ జరిపితే అన్ని విషయాలు బహిర్గతం అవుతాయన్నారు. కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్‌ కంపెనీ కూడా సీఎం బంధువులదేనని చెప్పారు. ఈ కుంభకోణంపై ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన బీజేపీ.. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అవినీతి, కుంభకోణాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. హైదరాబాద్‌ మెట్రో కోసం ఎల్‌ అండ్‌ టీకి ఇచ్చిన 280 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవడమే ప్రభుత్వ పెద్దల అసలు లక్ష్యమన్న కేటీఆర్‌.. దీనిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌, మంత్రుల అవినీతి అక్రమాలను ప్రజల్లో ఎండగడతామన్నారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 19 కుంభకోణాలపై సిట్టింగ్‌ జడ్జితో గానీ, సభాసంఘంతో గాని విచారణ వేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖను ఆదివారం అసెంబ్లీలో స్పీకర్‌కు అందజేసింది. రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో లెక్కకు మించి స్కామ్‌లు జరిగాయని తెలిపింది. మంత్రుల ప్రమేయంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రులకే ఆయా కుంభకోణాల్లో ప్రమేయం ఉందని ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ మాత్రమే కాదని అవమానమని పేర్కొంది.

Updated Date - Mar 30 , 2026 | 05:13 AM