Share News

మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీదే బాధ్యత: కేటీఆర్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:02 AM

మహిళా లోకానికి వెంటనే అందాల్సిన రిజర్వేషన్లు.. బీజేపీ కుటిల రాజకీయాల వల్లే దూరమయ్యాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీదే బాధ్యత: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): మహిళా లోకానికి వెంటనే అందాల్సిన రిజర్వేషన్లు.. బీజేపీ కుటిల రాజకీయాల వల్లే దూరమయ్యాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికినప్పటికీ... డీలిమిటేషన్‌ పేరుతో చిక్కుముళ్లు తెచ్చిపెట్టి బిల్లు విఫలమయ్యేలా చేసిందన్నారు. మహిళా సాధికారతపై బీజేపీకి చిత్తశుద్థి లేదని తేలిపోయిందన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను అమలుచేసి ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు. దీనికి మహిళల రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెట్టి వారి భుజాల మీదనుంచి దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని చూసిందన్నారు. దీంతో ఒక చారిత్రక అవకాశం చేజారిపోయిందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం మహిళలను వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. డీలిమిటేషన్‌ నిబంధన లేకుండా మహిళా రిజర్వేషన్ల కోసమే కొత్త బిల్లును ప్రవేశపెట్టి, రానున్న ఎన్నికల నుంచే దాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్‌పై విస్తృత చర్చ చేపట్టాలన్నారు. కశ్మీర్‌, అస్సాంలలో దేశవ్యాప్త డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా సీట్లపెంపు చేపట్టిన కేంద్రం.. తెలంగాణలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.

Updated Date - Apr 18 , 2026 | 05:02 AM