రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా..
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:14 AM
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. ఆ పార్టీ ఎమ్మెల్యేలే బహిర్గతం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో దీనితో తెలిసిపోతోంది
హైకోర్టు తీర్పుమాటున కల్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. ఆ పార్టీ ఎమ్మెల్యేలే బహిర్గతం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధే ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయడం చూస్తుంటే తెలంగాణలో పాలన ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అంతముందు, తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయడం సాధారణ విషయం కాదని.. ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఏటీఎంలా మార్చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ కూడా ఇదే మాట అంటున్నారని, కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిపై గతంలో ఈడీ దాడులు చేసిందని, కానీ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో బయటపెట్టలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్టు చెప్పుకొంటున్నారని.. అది తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు. రేవంత్ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బావమరుదులు, అల్లుడికి భూములు, కాంట్రాక్టులు, నిధులు దోచిపెట్టేందుకే 18 గంటలు పనిచేస్తున్నారని విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే కల్యాణలక్ష్మిని నిలిపేస్తూ హైకోర్టు తీర్పు వెలువడిందని కేటీఆర్ ఆరోపించారు. వచ్చే రెండేళ్లు బీఆర్‌ఎస్ శ్రేణులు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. స్థానిక సమస్యలను గుర్తించి పోరాటం చేయాలన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.