జగిత్యాల నుంచే జైత్రయాత్ర
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:06 AM
జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్‌ను సీఎం చేయడానికి కదం తొక్కుతాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జగిత్యాల, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తిరిగి కేసీఆర్‌ను సీఎంను చేసేందుకు ఇక్కడి నుంచే కదం తొక్కుతామని శనివారం మీడియాతో చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు. కేసీఆర్ వంటి సింహం బయటికి వస్తుందంటేనే గుంటనక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొన్నారు. ఏడాది తర్వాత బహిరంగసభలో పాల్గొనేందుకు కేసీఆర్ వస్తున్నారంటేనే కాంగ్రెస్ సర్కారు కుట్రలకు తెర లేపి.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. జగిత్యాలలో కేసీఆర్ సభ రోజే సీఎం రేవంత్ మేడిగడ్డ ప్రదర్శన పెట్టుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. కేసీఆర్ సభతో కాంగ్రెస్ ప్రభుత్వ అట్టర్ ప్లాప్ పాలన బయట పడుతుందని భయం పట్టుకున్న సీఎం రేవంత్.. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్‌తో కలిసి జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అంతకు ముందు జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్ పర్యవేక్షించారు. జగిత్యాలలోని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను మరోమారు బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.
బేషరతుగా బీజేపీ ఎంపీ తేజస్వి క్షమాపణ చెప్పాలి: హరీశ్
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉప నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోలుస్తారా? అని తేజస్విపై మండి పడ్డారు. జగిత్యాలలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ తేజస్విని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెనకేసుకొస్తున్నారన్నారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు లేని లోటు తెలుస్తోందన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు దిష్టిబొమ్మల్లా కూర్చున్నారని ఎద్దేవా చేశారు.