KTR and Harish Rao: ఎమర్జెన్సీలా కాంగ్రెస్ పాలన
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:24 AM
ఒక చానల్ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాల నేతలు ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం: కేటీఆర్
పండుగ పూట కక్షసాధింపు దారుణం: హరీశ్
కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనైతికం: కిషన్‌రెడ్డి
హైదరాబాద్/జహీరాబాద్/న్యూఢిల్లీ/హనుమకొండ టౌన్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఒక చానల్ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాల నేతలు ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండుగవేళ అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్టు చేయడం దారుణమని.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకుతెస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. సదరు జర్నలిస్టులు ఏదైనా తప్పు చేసి ఉంటే.. నోటీసులిచ్చి విచారణకు పిలవొచ్చని, కానీ అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మురికి రాజకీయాల్లో భాగస్వాములు కావొద్దని పోలీసులను కోరారు. ఇక పాలన చేతగాని సర్కారు పండుగపూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. రేవంత్‌రెడ్డి పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారని.. మీడియా సంస్థలను భయపెట్టి తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసు కమిషనర్ సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనైతికమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఓ వార్తా కథనంతో తలెత్తిన వివాదంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుపుతుండగానే.. రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా, జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి అరెస్టు చేయడం దురదృష్టకరమని ఒక ప్రకటనలో మండిపడ్డారు.
మూగబోయిన ‘కాళేశ్వరం’ అధికారుల ఫోన్లు!
మహదేవపూర్ రూరల్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఫోన్లు మూగబోయాయి. నెల రోజులుగా అధికారులకు కేటాయించిన నంబర్లు పనిచేయడం లేదు. ‘మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం సర్వీసులో లేదం’టూ చెబుతున్నాయి. వేల కోట్లతో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు కనీసం ఫోన్ బిల్లులు కూడా చెల్లించకపోవడంతో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కనెక్షన్లను నిలిపేశారు. దీంతో క్షేత్రస్థాయిలో సమాచారం పొందాలన్నా, ఇవ్వాలన్నా తీవ్ర అంతరాయం కలుగుతోంది.