నైనీ స్కాం నుంచి దృష్టి మళ్లించే యత్నం
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:55 AM
నైనీ బొగ్గు గని కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసుల డ్రామా ఆడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ప్రకటనలో విమర్శించారు.
సంతోశ్ కుమార్‌కు సిట్ నోటీసులు రాజకీయ కక్ష సాధింపు: కేటీఆర్
నేడు సింగరేణి స్కాంపై గవర్నర్‌కు ఫిర్యాదు
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నైనీ బొగ్గు గని కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసుల డ్రామా ఆడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ప్రకటనలో విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో మాజీ ఎంపీ సంతోశ్ కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ విచారణ అంతా ఒక అట్టర్ ఫ్లాప్ టీవీ సీరియల్‌లా సాగుతోందని ధ్వజమెత్తారు. అసలైన నిందితులను వదిలేసి కేసుతో సంబంధం లేని ప్రతిపక్ష నేతలను విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే వరుసగా బీఆర్‌ఎస్ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామని తాము ప్రకటించిన వెంటనే సంతోశ్‌కు నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని.. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దృష్టి మళ్లింపు చర్య అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తనను, హరీశ్‌రావును విచారించినా ఏమీ సాధించలేకపోయారని, ఇప్పుడు సంతోశ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, అక్రమాలు, అరాచకాలతో కూడిన ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ ఉల్లంఘనలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు లఘునాటిక ప్రదర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారో హెచ్‌సీయూ విద్యార్థులు కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారని అభినందించారు. కాగా, సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ నేతల కుంభకోణంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతల బృందం మంగళవారం కలవనుంది. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలను గవర్నర్‌కు అందించి, సమగ్ర విచారణ జరిపించాలని కోరతామని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.