స్పీకర్ తీర్పు వెనుక రాహుల్ ఒత్తిడి
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:28 AM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ ఇచ్చిన అప్రజాస్వామిక తీర్పు వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒత్తిడి ఉందని బీఆర్‌ఎస్....
బీఆర్‌ఎస్ బీఫామ్‌తో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ బీఫామ్‌తో ఎంపీగా పోటీ చేసినా కనిపించలేదా ?: కేటీఆర్
హైదరాబాద్, మార్చి11(ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ ఇచ్చిన అప్రజాస్వామిక తీర్పు వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒత్తిడి ఉందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఈ అంశంలో అసలు దోషి రాహుల్ అని బుధవారం ఓ ప్రకటన చేశారు. స్పీకర్ చేతుల్లో ఏమీలేదని, ఫిరాయింపుల వ్యవహారం మొ త్తాన్ని కాంగ్రెస్సే నడిపించిందని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ బీఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఫామ్‌తో ఎంపీగా పోటీ చేశారని, అయినా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించకుండా అనుకూలంగా తీర్పు చెప్పడం అత్యంత దుర్మార్గమని వాపోయారు. దానం నాగేందర్, కడి యం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు చూస్తే నవ్వొస్తుందన్నారు. కాగా, మంత్రుల బినామీల కోసం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో చట్టబద్ధంగా పట్టాలు పొంది, పదేళ్లుగా నివసిస్తున్న వెయ్యి మంది పేదల ఇళ్లను కూలగొట్టడం అత్యంత దారుణమన్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.