ఉచిత విద్యుత్తు రద్దుకు కుట్ర
ABN , Publish Date - May 25 , 2026 | 05:20 AM
కేసుల భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి సరెండర్ అయ్యాడు. అందుకే రాష్ట్రంలో ప్రీ పెయిడ్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు...
కేసుల భయంతోనే మోదీకి రేవంత్ సరెండర్
వ్యవసాయం, ఇళ్లలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం
ప్రజల్లో ఉండే వారికే కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం: కేటీఆర్
హైదరాబాద్ సిటీ/గోల్నాక, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘కేసుల భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి సరెండర్ అయ్యాడు. అందుకే రాష్ట్రంలో ప్రీ పెయిడ్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును రద్దు చేసి అదానీ, అం బానీ వంటి ప్రీ పెయిడ్ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తున్నారు. ఈ నిర్ణయం అమలు కాక ముందే కాంగ్రెస్ ఫ్యూజ్‌లు పీకేయాలి, అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ‘నా బూతు.. నా భవిష్యత్తు’ పేరిట అంబర్‌పేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి చీఫ్ మినిస్టర్(సీఎం) కాదు... కటింగ్ మాస్టర్ (సీఎం) అని కేటీఆర్ దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో నిర్మాణం చేపట్టి పూర్తయిన వంతెనలు, భవనాలకు జేబులో కత్తెర పెట్టుకొని ప్రారరంభిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న కరెంటు మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మీటర్లు వస్తే.. మొబైల్ ఫోన్ల తరహాలో ముందే రీ చార్జ్ చేసుకొని.. బ్యాలెన్స్ మేరకు విద్యుత్ వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో కాంగ్రెస్ చేస్తోన్న కుట్రలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో మోదీ ఎంత ఒత్తిడి చేసినా.. రూ.30 వేల కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా.. కేసీఆర్ ఎదురించారే తప్ప.. మీటర్లు పెట్టేందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో అర్హుల ఓట్లు జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ వాళ్లు కొందరి ఓట్లు తొలగించే కుట్ర చేస్తారని, వారితో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. డిసెంబరు లేదా జనవరిలో కార్పొరేషన్ల ఎన్నికలు ఉండే అవకాశముందన్నారు. ఎమ్మెల్యేలు, పెద్ద నాయకుల చుట్టూ తిరగకుండా ప్రజల్లో ఉండి.. వారి సమస్యలపై పోరాడిన, సభ్యత్వ నమోదులో కీలకంగా వ్యవహరించిన వారికి సర్వేల ఆధారంగా పార్టీ టికెట్ ఇస్తామని కేటీఆర్ చెప్పారు.