Share News

విద్యాశాఖను విధ్వంసం చేస్తారా?

ABN , Publish Date - May 04 , 2026 | 03:59 AM

లంగాణ రాష్ట్ర విద్యాశాఖను విధ్వసం చేయడమే నీ లక్ష్యమా...? అందుకే ఆశాఖను ఎవరికీ ఇవ్వకుండా నీదగ్గర పెట్టుకున్నావా..

విద్యాశాఖను విధ్వంసం చేస్తారా?

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దుకే చీకటి జీవో 7: కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖను విధ్వసం చేయడమే నీ లక్ష్యమా...? అందుకే ఆశాఖను ఎవరికీ ఇవ్వకుండా నీదగ్గర పెట్టుకున్నావా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు ఆయన బహిరంగ లేఖరాశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేసేందుకే భయంకరమై కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో 7 ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడ అని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్‌మెంట్‌ పథకాన్ని రాజకీయాలకతీతంగా తెలంగాణలో గత సీఎం కేసీఆర్‌ కొనసాగించారని పేర్కొన్నారు. మీ సొంత పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఫీజుల పథకానికి తూట్లు పొడవడానికి మీకు సిగ్గనిపించడం లేదా? అని సీఎంను ప్రశ్నించారు. ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా? అని నిలదీశారు. జీవో 7ను వెంటనే వెనక్కుతీసుకొని, విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని సీఎంను లేఖ ద్వారా కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ అంటేనే కరప్షన్‌ : ఎర్రోళ్ల

కాంగ్రెస్‌ అంటేనే కరప్షన్‌ అని.. అవినీతికి కాలేజీ పెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే ఓ సిలబస్‌ అవుతుందని బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హ్యామ్‌ రోడ్లలో 25 శాతం ఎక్సెస్‌ టెండర్లు ఇచ్చింది నిజమా కాదా బయటపెట్టాలన్నారు. అక్రమ మైనింగ్‌పై కాంగ్రెస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అన్ని శాఖల్లో అవినీతి జరుగుతోందని దాన్ని బయటపెట్టిన బీఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ విమర్శలు చేయడం తగదన్నారు. ఆర్థిక శాఖలో భట్టి ట్యాక్స్‌, ఇరిగేషన్‌లో ఉత్తమ్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌లో జూపల్లి ట్యాక్స్‌, రవాణా శాఖలో పొన్నం ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విమర్శించారు.

Updated Date - May 04 , 2026 | 03:59 AM