హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:13 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని, ఈ నెల 16 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్....
బడ్జెట్ సమావేశాల్లో సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని, ఈ నెల 16 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. గోల్కొండ రిసార్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియెంటేషన్ సమావేశం మంగళవారం ముగిసింది. కాంగ్రెస్ హామీల అమల్లో వైఫల్యాలు, మోసాలను ఎండగట్టేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరగలేదని, మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని బీఆర్‌ఎ్‌సకు ద్రోహంచేసి వెళ్లిన ఎమ్మెల్యేకు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్నట్లుగానే అసెంబ్లీలో మందబలంతో బుల్డోజర్ పద్ధతిలో పోతున్నారని ఆరోపించారు. రాహుల్‌గాంధీకి వెయ్యికోట్లు ఇస్తామని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. రైతులకు రైతుబంధును ఇవ్వటంలేదన్నారు. ఖమ్మంలో వెలుగుమట్ల బాధితులు, మూసీ బాధితుల తరఫున, పేద దళిత, గిరిజనులకు హామీ ఇచ్చిన నిధులకోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ తెలిపారు.