రేవంత్ బినామీ కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు: కేటీఆర్
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:23 AM
కాంగ్రెస్ సర్కారు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి తన బినామీ కంపెనీకి రూ.వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని బీఆర్‌ఎస్....
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సర్కారు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి తన బినామీ కంపెనీకి రూ.వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ఓవైపు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రూ.15 లక్షలు కూడా లేవని దివాలా పిటిషన్ వేసిన కేఎల్‌ఎ్‌సఆర్ కంపెనీకి.. అక్రమంగా రూ.6 వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారన్నారు. అమృత్ స్కీమ్, జల్‌జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ ఈ బినామీ కంపెనీకే దక్కాయని చెప్పారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేఎల్‌ఎ్‌సఆర్ అనే కంపెనీ మొదట్నుంచీ రేవంత్‌కు బినామీ కంపెనీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయితే దివాలా తీసిన ఈ కంపెనీలో కొనసాగుతున్న వందల కోట్ల ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు వారం కింద తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని వెల్లడించారు. ‘దివాలా తీసిన ఆ కంపెనీ సీఎంది కాకుంటే.. సుప్రీంకోర్టు ఆదేశించినట్లు రాష్ట్రంలో సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలి. అప్పటివరకు కేఎల్‌ఎ్‌సఆర్ కంపెనీకి ఇచ్చిన ప్రతి కాంట్రాక్టును రద్దుచేయాలి.’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కి సాక్షాత్తూ సీఎం రేవంత్ కండువా కప్పి కాంగ్రె్‌సలోకి తీసుకొని.. ఆయన పార్టీ మారలేదని సీఎం ప్రకటించడం అర్థరహితమని ‘ఎక్స్’లో మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎ్‌సఎల్పీ విప్ కేపీ వివేకానందగౌడ్ దుయ్యబట్టారు. అసెంబ్లీలో స్పీకర్ వద్ద జరిగిన విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి కేసును స్పీకర్ ఈనెల 19కి వాయిదా వేశారని, కావాలనే కడియం తరఫు న్యాయవాదులు మరింత సమయం కావాలని కోరారన్నారు. కాంగ్రెస్ బీ ఫారంతో ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌పై పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. కేసు విచారణకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రె్‌సను బీజేపీ రక్షిస్తోందని దుయ్యబట్టారు.