కృష్ణా జలాల్లో 600 టీఎంసీలు మనవే..
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:16 AM
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా కృషి చేయాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ గంపగుత్తగా..
75 శాతం డిపెండబులిటీతో 555 టీఎంసీలు సాధించాలి
పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే జలాల్లో మరో 45 టీఎంసీలూ మనకే..
నీటి వివాదాల కేసులపై సమీక్షలో సీఎం
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా కృషి చేయాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు తెలంగాణకు దక్కేలా జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌లో వాదనలు ఉండాలని తెలిపారు. జల వివాదాలపై సుప్రీంకోర్టులో ఉన్న వివిధ కేసులతో పాటు బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ (కృష్ణా-2)లో వాదనలపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ వైద్యనాథన్‌తో కలిసి సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభు త్వం కృష్ణా డెల్టాకు తరలించే 80టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు కృష్ణాలో అంతమొత్తం నీటిని వినియోగించుకోవచ్చనే వెసులుబాటు వల్ల ఉమ్మడి ఏపీకి దక్కి న 45 టీఎంసీలు కలిపి మొత్తం 600 టీఎంసీల కృష్ణాజలాలు తమకు రావాలని 2023లో స్టేట్‌మెంట్ ఆఫ్ కేస్ (ఎస్‌వోసీ) దాఖలు చేసినట్లు న్యాయవాదు లు సీఎంకు నివేదించారు. ఈ కేసులో ఏపీ కౌంటర్ వాదనలు వినిపించడం పూర్తయిందని, తెలంగాణ రీజాయిండర్ ప్రారంభమైందని తెలిపారు. దీంతో కృష్ణాలో మొత్తంగా ఉమ్మ డి ఏపీకి లభించే 856 టీఎంసీల్లో 600 టీఎంసీలు తెలంగాణకు దక్కేలా వాదనలు ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఆ మేరకు నీటి వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని గుర్తుచేశారు. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు తరలించడం వల్ల ఉమ్మడి ఏపీకి దక్కే 45 టీఎంసీలపై పూర్తి అధికారం తెలంగాణదేనని సీఎం స్పష్టం చేశారు.
ఈ 80 టీఎంసీల్లో 35 టీఎంసీల వినియోగానికి మహారాష్ట్ర, కర్ణాటకలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని, మిగతా 45 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సిందేనని తెలిపారు. జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2011లో ఇచ్చిన అవార్డుపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో వచ్చేనెలలో వాదనలు వినిపించాల్సి ఉందని న్యాయవాదులు తెలిపారు. దీంతో కృష్ణా ట్రైబ్యునల్-2 తీర్పు అమల్లోకి వస్తే తెలంగాణకు అన్యాయం జరిగే ప్ర మాదం ఉందని, సరైన గ్యారంటీలు లభించకుండా ఈ తీర్పునకు అంగీకారం తెలపరాదని సీఎం అన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో జలవిద్యుత్ ఉత్పాదన కోసం జారీచేసిన జీవోపై సుప్రీంకోర్టులో కేసు ఉందని అధికారులు తెలిపారు. పోలవరం-బనకచర్ల అనుసంధానాన్ని సవాలుచేస్తూ దాఖలు చేసిన కేసులో సమన్ల జారీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన నీటి వాటాను సాధించేలా పోరాటం చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ అడ్వొకేట్ జనరల్‌తో పాటు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ కుశ్విందర్ వోహ్రా తదితరులు పాల్గొన్నారు.