కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు లైన్ క్లియర్
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:40 AM
కృష్ణానదిపై సోమశిల సిద్ధేశ్వరం వద్ద వంతెన కల సాకారం కానుంది. ఇక్కడ ఐకానిక్ వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ. 1,082 కోట్ల వ్యయంతో వంతెన మంజూరైనా...
పూర్తయితే తిరుపతి, చెన్నైలకు తగ్గనున్న దూరాభారం
నాగర్‌కర్నూల్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : కృష్ణానదిపై సోమశిల సిద్ధేశ్వరం వద్ద వంతెన కల సాకారం కానుంది. ఇక్కడ ఐకానిక్ వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ. 1,082 కోట్ల వ్యయంతో వంతెన మంజూరైనా పర్యావరణ అనుమతులు రాకపోవడం వల్ల దాదాపు రెండున్నర ఏళ్లుగా దాని నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడని విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కేంద్ర రోడ్డు రవాణా శాఖకు చెందిన ఉన్నతాధికారులు శివగామి, ఈఈ పింటోల సారథ్యంలోని అధికారుల బృందం ఐకానిక్ వంతెన నిర్మించనున్న ప్రదేశాన్ని సందర్శించింది. వంతెన నిర్మించే ప్రదేశంలో అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో సామాజిక వనానికి భూమి కేటాయించడానికి జిల్లా యంత్రాంగం సుముఖత వ్యక్తం చేయడంతో కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు వచ్చాయి. దీని నిర్మాణం పూర్తయితే తిరుపతి, చెన్నైలకు ప్రయాణ దూరం తగ్గిపోనుంది.