Share News

నేడు జూరాలను తాకనున్న కృష్ణమ్మ..!

ABN , Publish Date - Jul 26 , 2026 | 06:02 AM

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో వర్షాలతో ఎగువ కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల గేట్లను ఇప్పటికే ఎత్తగా.. శనివారం ఉజ్జయిని గేట్లు కూడా తెరుచుకున్నాయి

నేడు జూరాలను తాకనున్న కృష్ణమ్మ..!

  • ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి కొనసాగుతున్న వరద

  • తెరుచుకున్న ఉజ్జయిని గేట్లు

హైదరాబాద్‌/గద్వాల/మహదేవపూర్‌ రూరల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో వర్షాలతో ఎగువ కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల గేట్లను ఇప్పటికే ఎత్తగా.. శనివారం ఉజ్జయిని గేట్లు కూడా తెరుచుకున్నాయి. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం వరద చేరే అవకాశముంది. ఆల్మట్టికి ఇన్‌ఫ్లో 84,888 క్యూసెక్కులుండగా.. శనివారం మధ్యాహ్నం వరకు 67,500 క్యూసెక్కుల అవుట్‌ఫ్లోను కొనసాగించిన అధికారులు సాయంత్రానికి 35 వేల క్యూసెక్కులకు తగ్గించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా ప్రస్తుతం 108.660 టీఎంసీలున్నాయి. దిగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా.. 8 గేట్ల ద్వారా 24,560 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 33.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.96 క్యూసెక్కులున్నాయి. ఇటు మహారాష్ట్రలోని బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టుకు 54,249 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో.. గేట్లను ఎత్తి 900 క్యూసెక్కులను స్పిల్‌వే ద్వారా వదులుతున్నారు. దిగువనున్న జూరాల ప్రాజెక్టుకు ఆదివారం వరద చేరే అవకాశముంది. జూరాల జలాశయంలో 9.650 టీఎంసీలకు ప్రస్తుతం 5.042 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తేనే ఎత్తిపోతల పథకాలతో పాటు కాలువలకు నీరు విడుదలయ్యే అవకాశముంది. ఇటు కృష్ణా ఉప నది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయం సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా, నిలకడగా 14,281 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 30.38 టీఎంసీలకు చేరాయి.


మేడిగడ్డకు 1.22 లక్షల క్యూసెక్కులు..

మేడిగడ్డ బ్యారేజీకి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం వరకు 22 వేల క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో శనివారం సాయంత్రానికి 1.22 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 2.7 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉన్నట్టు వెల్లడించారు.

Updated Date - Jul 26 , 2026 | 06:04 AM