Share News

శ్రీశైలంలో మిగిలిన నీళ్లన్నీ తెలంగాణకు

ABN , Publish Date - May 13 , 2026 | 04:15 AM

శ్రీశైలం జలాశయంలో మిగిలిన జలాలన్నీ తెలంగాణకే కేటాయించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది.

శ్రీశైలంలో మిగిలిన నీళ్లన్నీ తెలంగాణకు

  • సాగర్‌లో 10 టీఎంసీలు ఏపీకి, మిగిలిన 18.21 టీఎంసీలు తెలంగాణకు

  • కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో మిగిలిన జలాలన్నీ తెలంగాణకే కేటాయించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక నాగార్జున సాగర్‌లో కుడికాలువ నుంచి ఏపీకి 10 టీఎంసీలు, మిగిలిన నీళ్లు తెలంగాణకు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు త్రిసభ్యకమిటీ(కృష్ణాబోర్డు మెంబర్‌ కన్వీనర్‌, తెలుగు రాష్ట్రాల అధికారులు) సమావేశం మంగళవారం జరిగింది. శ్రీశైలంలో కనీస నీటిమట్టం(810 మీటర్లు)పైన 5.27 టీఎంసీల నీటి లభ్యత ఉండగా... అదే నాగార్జునసాగర్‌లో కనీస నీటిమట్టం(510 మీటర్లపైన) 28.21 టీఎంసీల నిల్వ ఉంది. ఇందులో 10 టీఎంసీలు ఏపీకి ఇచ్చాక... మిగిలిన 18.21 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వనున్నారు. ఇక శ్రీశైలం జలాశయం నుంచి మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్‌ జంటనగరాలు, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల తాగునీటి అవసరాల కోసం 13 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరగా.. నాగార్జునసాగర్‌ నుంచి తాగునీటి అవసరాలకి 10 టీఎంసీల జలాలను కుడి ప్రధాన కాల్వకు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. దీంతో సాఫీగా జలాలు పంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. దాంతో కృష్ణాబోర్డు బుధవారం ఆర్డర్‌ను విడుదల చేయనుంది.

Updated Date - May 13 , 2026 | 04:16 AM