కేపీహెచ్‌బీలో రియల్ ఎస్టేట్ జోరు
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:14 AM
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని తెలంగాణ గృహనిర్మాణ సంస్థ...
గజం రూ.2.65 లక్షలు.. ఎస్‌ఎఫ్‌టీ రూ.7,993
ప్రభుత్వానికి రూ.24.5 కోట్ల ఆదాయం
కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని తెలంగాణ గృహనిర్మాణ సంస్థ (టీజీహెచ్‌బీ) నిర్వహించిన తాజా వేలం మరోసారి నిరూపించింది. శుక్రవారం వెస్ట్రన్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఓపెన్ ఆక్షన్ ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.24.5 కోట్ల ఆదాయం సమకూరింది. ముఖ్యంగా ధర్మారెడ్డి ఫేజ్-1 కాలనీలో గృహ అవసరాల కోసం కేటాయించిన స్థలానికి ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ గజం 1.5 లక్షలుగా నిర్ణయించగా, వేలంలో పోటీపడి మరీ గరిష్ఠంగా రూ.2.65 లక్షలకు దక్కించుకన్నారు. ఒకప్పుడు నివాస ప్రాంతంగా ఉన్న ధర్మారెడ్డి కాలనీ క్రమంగా వ్యాపార,వాణిజ్య కేంద్రంగా మారుతుండడమే ఈ స్థాయి ధర పలకడానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే పదేళ్లక్రితం నిర్మించిన ‘సంపూర్ణం’ గృహ సముదాయంలోని ఫ్లాట్లకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఇక్కడ 1400 ఎస్‌ఎ్‌ఫటీ కలిగిన త్రిబుల్‌బెడ్‌రూం ఫ్లాట్ ధర గరిష్ఠంగా రూ.1,10,50,000 పలికింది. అంటే చదరపు అడుగుకు (ఎస్‌ఎఫ్‌టీ) రూ.7,993 ధర పలకడం విశేషం. పాత నిర్మాణాల్లోనూ ఈ స్థాయిలో ధరలు ఉండడం కేపీహెచ్‌బీ మార్కెట్ విలువను తెలియజేస్తోంది. వేలంలో మొత్తం 4ఓపెన్ ప్లాట్లు, 8ఫ్లాట్ల కోసం 40మంది పోటీపడ్డారు. విజేతలు 5 రోజుల్లో 25 శాతం సొమ్మును, మిగిలిన మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని వెస్ట్రన్ డివిజన్ ఈఈ అంకమరావు తెలిపారు.