Share News

మాకొద్దీ డంపింగ్‌ యార్డ్‌

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:27 AM

తమ ఆరోగ్యాల పాలిట శాపంగా మారనున్న డంపింగ్‌ యార్డును వెనక్కి తీసుకోవాలని, వెంటనే జీవోను రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని..

మాకొద్దీ డంపింగ్‌ యార్డ్‌

  • రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల ప్రజల నిరసన

  • జీవోను రద్దు చేయాలంటూ చలో కలెక్టరేట్‌కు పిలుపు

  • అడ్డుకున్న పోలీసులు.. ఆందోళనకారుల ధర్నాతో ఉద్రిక్తత

కొత్తూర్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తమ ఆరోగ్యాల పాలిట శాపంగా మారనున్న డంపింగ్‌ యార్డును వెనక్కి తీసుకోవాలని, వెంటనే జీవోను రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొత్తూరు మండల ప్రజలు చేపట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మండల పరిధిలోని సిద్దాపూర్‌లో ఏర్పాటు చేయనున్న డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తూ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యెల్లారం శేఖర్‌రెడ్డి, జేఏసీ చైర్మన్‌ అంబటి ప్రభాకర్‌ల నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్‌ నాయకులతోపాటు, పలువురు ఆందోళనకారులను శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయితే అరెస్టులను లెక్కచేయకుండా వేలాది మంది జేపీ దర్గా వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్ర ఇన్ముల్‌నర్వ చౌరస్తాకు చేరుకోగానే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని అడ్డుకున్నారు. దాంతో ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు.

Updated Date - Jul 19 , 2026 | 06:28 AM