కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ అదృశ్యం!
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:04 AM
ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కొత్తగూడెంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన...
కాంగ్రెసోళ్లు అపహరించారంటూ వనమా ఆందోళన
కొత్తగూడెం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కొత్తగూడెంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన 31సీట్లు ఎవరికీ లేకపోవడంతో ప్రతి పార్టీ తమ అభ్యర్థులను కాపాడుకుంటూనే ఇతర పార్టీల వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఫలితాలు ప్రకటించిన గంటల వ్యవధిలోనే తమ అభ్యర్థులను గుట్టుగా క్యాంపులకు తరలించారు. సీపీఐ అభ్యర్థులను ఏపీ సరిహద్దు ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థులను ఖమ్మం తరలించగా.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇక బీఆర్‌ఎ్‌సకు చెందిన ఏడుగురిని హైదరాబాద్ తరలించగా.. 32వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన రాంబాబు కనిపించకుండా పోవడం కొత్తగూడెంలో కలకలం రేపింది. తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, రాంబాబు భార్య నాగమణితో కలిసి పాల్వంచలో శుక్రవారం రాత్రి ధర్నా చేశారు. కాంగ్రెస్ నేతలే తమ కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేశారని వనమా ఆరోపించారు. ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో ధర్నా విరమించారు.