Share News

గెలుపే లక్ష్యంగా పధాన పార్టీల కృషి..

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:49 AM

రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతుండగా.. అందరి చూపు మాత్రం కొత్తగూడెం మునిసిపల్‌ కార్పొరేషన్‌పైనే ఉంది.

గెలుపే లక్ష్యంగా పధాన పార్టీల కృషి..

  • కాంగ్రెస్‌, సీపీఐ వేర్వేరుగా పోటీ

  • కొత్తగూడెంలో రసవత్తర పోరు

  • గెలుపే లక్ష్యంగా పధాన పార్టీల కృషి

  • మొత్తం 60 డివిజన్లు.. మేయర్‌ పీఠం ఎక్కాలంటే 31 స్థానాలు కావాల్సిందే

(కొత్తగూడెం నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతుండగా.. అందరి చూపు మాత్రం కొత్తగూడెం మునిసిపల్‌ కార్పొరేషన్‌పైనే ఉంది. కార్పొరేషన్‌ స్థాయిలో తొలిసారి జరుగుతున్న ఎన్నిక ఇది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో భాగమైన పాల్వంచలో దాదాపు 21 ఏళ్ల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా ఇక్కడ రాజకీయం వేడెక్కింది. 60 డివిజన్లు ఉన్న ఇక్కడి బల్దియాపై జెండా ఎగురవేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సర్వ శక్తులు ఒడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 31 స్థానాలు సాధించి మేయర్‌ పీఠాన్ని సింగిల్‌గా దక్కించుకోవడంపైనే దృష్టి పెట్టాయి. ఒకవేళ సింగిల్‌ పార్టీగా పీఠం దక్కించుకోలేని పక్షంలో చివరి నిమిషంలో పొత్తుల విషయంలో మార్పులుండే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌, సీపీఐ, బీఆర్‌ఎస్‌ పార్టీలతో పాటు.. బీజేపీ, జనసేన, బీఎస్పీల తరఫున కూడా అభ్యర్ధులు బరిలో నిలిచారు. టీడీపీ నుంచి కూడా పలువురు పోటీలో నిలవగా.. ఆ పార్టీ నుంచి అధికారికంగా బీఫామ్‌లు రాకపోవడంతో సీపీఐ గుర్తుపైనే వారు పోటీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌, సీపీఐ ఽమధ్య కుదిరిన మిత్రుత్వం.. మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ కొనసాగుతోందని అందరూ భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. కాంగ్రెస్‌ 58 స్థానాల్లో పోటీలో ఉండగా పొత్తు కింద సీపీఎంకు 2 కేటాయించింది. సీపీఐ 57 స్థానాల్లో బరిలో ఉండగా టీడీపీకి 3 స్థానాలను కేటాయించింది. బీఆర్‌ఎస్‌ 58 స్థానాలు, బీజేపీ 53, జనసేన 14, బీఎస్పీ 6, ఇతరులు 15, స్వతంత్రులు 91 మంది పోటీలో ఉన్నారు. ప్రఽధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, సీపీఐ, బీఆర్‌ఎస్‌ మధ్యనే కొనసాగుతోంది. అయితే అధికార కాంగ్రెస్‌ తరఫున కొన్ని డివిజన్‌లలో టికెట్‌ ఇచ్చిన అభ్యర్థుల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల పార్టీల్లోకి వచ్చినవారికి, ముఖ్య నేతలకు దగ్గరగా ఉన్న వారికి టికెట్‌లు కేటాయించడం ఎంతవరకూ సమంజసమంటూ నేతలు, క్యాడర్‌ గుసగుసలాడుకుంటున్నారు.


పొత్తులపై ఎత్తులు!

కాంగ్రెస్‌, సీపీఐ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ కూడా తమ ఉనికిని చాటుకునేలా కీలక స్థానాలు దక్కించుకునేలా వ్యూహాలు వేస్తోంది. కాంగ్రె్‌సకు 20-25 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెబుతుండగా, సీపీఐకి 18-20 లేదా అంతకు రెండు ఎక్కువ రావొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రె స్‌కు కొత్తగూడెంలో, సీపీఐకు పాల్వంచలో కలిసివస్తుందని కూడా ఇక్కడ చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌కు 8-10 వరకు సీట్లు రావొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 31 స్థానాలు కావాలి. కానీ సింగిల్‌ పార్టీగా మేయర్‌ పీఠం దక్కే పరిస్థితులు ఇక్కడ కనబడడంలేదు. ఏ పార్టీకి మేయర్‌ పీఠానికి అవసరమైన సీట్లు దక్కకపోతే చివరినిమిషంలో పొత్తుల విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. మేయర్‌ పీఠం కోసం అవసరమైన స్థానాలు కాంగ్రెస్‌, సీపీఐకు దక్కకపోతే.. ఈ రెండు పార్టీలు సమన్వయం చేసుకుని పొత్తు కుదుర్చుకుని మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఎక్స్‌ అఫీషియో ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ఎంపీ, సీపీఐ తరఫున ఎమ్మెల్యే ఉన్నారు.

ఉద్యోగాలు, పింఛన్లు, అభివృద్ధి కావాలంటున్న జనం

ఓట్ల కోసం వెళ్తున్న నాయకులు, ద్వితీయ శ్రేణి క్యాడర్‌పై జనం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు వెళ్లినప్పుడు ప్రధానంగా ఉద్యోగాల గురించి యువత అడుగుతుండగా, వృద్ధులు పింఛన్ల పెంపు గురించి అడుగుతున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 07:39 AM