సీపీఐ, కాంగ్రెస్.. చెరో రెండున్నరేళ్లు!
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:31 AM
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకోవాలని సీపీఐ, కాంగ్రెస్ అవగాహనకు వచ్చాయి.
‘కొత్తగూడెం’పై ఒప్పందం
కొత్తగూడెం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకోవాలని సీపీఐ, కాంగ్రెస్ అవగాహనకు వచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతల భేటీ అనంతరం దీనిపై స్పష్టత వచ్చింది. తొలి రెండున్నరేళ్లు సీపీఐ మేయర్, కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ పదవులు తీసుకోనుండగా.. తర్వాతి రెండున్నరేళ్లు కాంగ్రెస్ మేయర్, సీపీఐ డిప్యూటీ మేయర్ పదవులను తీసుకునేలా ఒప్పందం కుదిరినట్టు ఆ పార్టీల నేతలు వెల్లడించారు.కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. ఈ మేరకు సీపీఐకి చెందిన ఎస్టీ కార్పొరేటర్‌కు మేయర్ పదవి దక్కనుంది. సీపీఐకి ముగ్గురు ఎస్టీ కార్పొరేటర్లు మూడ్ గణేశ్, నునావత్ శ్యామల, బాణోత్ కళావతి ఉన్నారు. వీరిలో సుజాతనగర్ డివిజన్‌కు చెందిన గణేశ్‌కు మేయర్ పీఠం దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.