Share News

స్నేహ ధర్మం వీడితే.. మీకూ బీఆర్‌ ఎస్‌కు పట్టిన గతే

ABN , Publish Date - Aug 07 , 2026 | 06:17 AM

‘మమ్మల్ని అవమానిస్తే ఊరు కోం.. స్నేహ ధర్మానికి కట్టుబడి ఉన్నాం.. మీరు మమ్మల్ని వీడితే మిమ్మల్ని కాపాడేవారే ఉండరు.. మీ శిలాఫలకాన్ని మీరు పెట్టుకున్నట్లే..

స్నేహ ధర్మం వీడితే.. మీకూ బీఆర్‌ ఎస్‌కు పట్టిన గతే

  • కమ్యూనిస్టులను మొక్కలే కదా పీకేద్దామనుకుంటే పీక కోస్తాం

  • కాంగ్రెస్‌పై కూనంనేని వ్యాఖ్యలు

  • పాలకుల్లో మార్పు తెచ్చేందుకే ప్రజా చైతన్యయాత్రలని వెల్లడి

  • భద్రాద్రి జిల్లాలో యాత్ర ప్రారంభం

పినపాక/మణుగూరు ఆగస్టు6(ఆంధ్రజ్యోతి): ‘మమ్మల్ని అవమానిస్తే ఊరు కోం.. స్నేహ ధర్మానికి కట్టుబడి ఉన్నాం.. మీరు మమ్మల్ని వీడితే మిమ్మల్ని కాపాడేవారే ఉండరు.. మీ శిలాఫలకాన్ని మీరు పెట్టుకున్నట్లే.. మీ శవపేటికను మీరే తయారు చేసుకున్నట్టే.. బీజేపీ లాంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలోకి రానివ్వకూడదనే మీకు మద్దతిచ్చాం’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మిత్రపక్షం కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ పిలుపులో భాగంగా.. భద్రాద్రిజిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్‌ రోడ్‌ నుంచి గురువారం ప్రజా చైతన్య యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ‘కమ్యూనిస్టులదేముంది మొక్కలే కదా పీకేస్తే పోలా అనుకుంటే పీక కోస్తాం.. కమ్యూనిస్టులు పది మందే ఉన్నారనుకుంటే ఆ పదిమందే మీ సంగతి తేలుస్తారు.. పినపాకలో పోటీ చేయాల్సి వస్తే అందుకు మేం సిద్ధం ఉన్నాం’ అని మిత్రపక్షం కాంగ్రెస్ కు తేల్చి చెప్పారు. కేంద్రంలో మతతత్వపార్టీ అయిన బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, ఎక్కడ చూసినా దొంగలు పడుతున్నారని, ఆ ప్రభుత్వం దేవుళ్లను అడ్డంపెట్టుకుని సాగిస్తున్న రాజకీయాలు చెల్లే పరిస్థితి లేదన్నారు. పాలనలో మార్పు కోసమే దేశవ్యాప్తంగా సీపీఐ ప్రజా చైతన్య యాత్రలను ప్రారంభించిందని, ఈనెల 14 వరకు ఇవి కొనసాగుతాయని అన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 06:18 AM