అధికారిక శ్రమదోపిడీని రద్దు చేయాలి:కూనంనేని
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:58 AM
కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగులకు నామమాత్రపు వేతనాలు ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఆరోపించారు.
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగులకు నామమాత్రపు వేతనాలు ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఆరోపించారు. వీరికి తక్షణమే కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని భరోసా ఇచ్చారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు కూనంనేని సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ విద్యావిధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి ప్రతినిధులు ప్రొఫెసర్ హరగోపాల్, చక్రధర్ రావు డిమాండ్ చేశారు. గురువారం వీరు ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావును కలిసి విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని వినతిపత్రం సమర్పించారు. మరోవైపు, కులగణనలో పాల్గొన్న ఎన్యుమరేటర్లకు గౌరవ వేతనాలు చెల్లించకపోవడంపై ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం (పీటీఏ) మండిపడింది. టీచర్లు, సమాఖ్య సభ్యులకు రావాల్సిన రూ. 105 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని పీటీఏ అధ్యక్షుడు కె. మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ఖైరతాబాద్‌లోని ఆర్థిక గణాంక శాఖ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు.