ఎన్డీయే సర్కారు నిధులతోనే కొండగట్టు అభివృద్ధి
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:03 AM
కొండగట్టు అభివృద్ధికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది శూన్యమని.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే సర్కారు నిధులతోనే కొండగట్టు అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది శూన్యం
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్ నుంచి కొండగట్టుకు అంజన్న ఆశీర్వాద యాత్ర
కరీంనగర్, జగిత్యాల, మార్చి 14(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొండగట్టు అభివృద్ధికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది శూన్యమని.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే సర్కారు నిధులతోనే కొండగట్టు అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అందిస్తే పార్టీ ప్రజాప్రతినిధులందరితో కలిసి కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఉదయం 7గంటలకు కరీంనగర్‌లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ను ప్రారంభించారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి వేలాది మంది కాషాయ శ్రేణులతో కాలి నడకన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వరకు 40 కిలో మీటర్ల మేర యాత్ర సాగింది. రాత్రి 10.30 గంటలకు ముగిసింది. అప్పటికే సమయం మించిపోవడంతో గర్భాలయం మూసివేశారు. ఆలయ ద్వారం వద్దనే బండి సంజయ్ మొక్కు చెల్లించుకున్నారు. పాదయాత్రను కొనసాగిస్తూనే మార్గమద్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రసాదం స్కీం కింద కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట ఆలయాలను టెంపుల్ కారిడార్‌గా చేయాలని ప్రయత్నించానని, అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆలయాలను అభివృద్ధి చేయలేదని, తాము చేయడానికి ముందుకు వస్తే చేయనివ్వలేదన్నారు.ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు నిధులతో కొండగట్టు, ఇతర ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేటీటీడీ తరహాలో కొండగట్టును అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందికాంగ్రెస్ లో చేరి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నామన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కాగా రామడుగు మండలం కోనరావుపేట గ్రామం వద్దకు మహాపాదయాత్ర చేరుకోగానే కార్యకర్తల కోలాహలం, డీజే శబ్దాల మధ్య కార్యకర్తలు డ్రోన్‌లు ఎగురవేయడంతో ఓ చెట్టుపై ఉన్న తెనేతుట్టె కదిలింది. తేనెటీగల దాడిలో ముగ్గురు కార్పొరేటర్లు, మరో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు.
ఎమ్మెల్యే మందుల సామేల్‌పై అనర్హత వేటు వేయాలి..
తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌పై అనర్హత వేటు వేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని, ఆయన మళ్లీ పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సామేల్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్‌గా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆశీర్వదించిన బ్రాహ్మణులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనికి వేదికపై ఉన్న కాంగ్రెస్ నాయకులు చప్పట్లు కొట్టడం సిగ్గు చేటన్నారు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల బాటలో వారి ఎమ్మెల్యేలు నడుస్తున్నారన్నారు.