కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి
ABN , Publish Date - May 04 , 2026 | 04:39 AM
తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతోనే మనుగడ సాగిస్తోందని, రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
మహిళా బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్సే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సంగారెడ్డి అర్బన్/మెదక్ అర్బన్, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతోనే మనుగడ సాగిస్తోందని, రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను తెలంగాణకు కేటాయించడమే కాకుండా, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల కంటే ఎక్కువగా తెలంగాణకు యూరియాను సరఫరా చేస్తోందని తెలిపారు. రాష్ట్ర అవసరాల కంటే 7 శాతం అధికంగా వరి పండినా, కేంద్రమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్‌కు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. గతంలో వారు ప్రవేశపెట్టిన బిల్లు లోపభూయిష్టంగా ఉందని, దానివల్ల మహిళలకు అన్యాయం జరుగుతుందని భావించి బీజేపీ సవరణలు కోరితే.. కావాలనే ఆ బిల్లును అడ్డుకుని మహిళా లోకానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తూనే వచ్చిందని విమర్శించారు. ఈ నెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే మోదీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు.